చిన్నపాటి చదువు చదివిన కూడా మంచి జీతంతో ఉద్యోగాలు చేయాలని భావించే యువత ఉన్న నేటి తరుణంలో.. తమ గ్రామానికి సేవ చేయాలని సంకల్పంతో.. సర్పంచ్‌గా బరిలోకి దిగింది బీటెక్ ఇంజనీరింగ్ విద్యార్థిని దివానం గాయత్రి.
ఇంటి దగ్గర ఉద్యోగం చేస్తూనే.. సర్పంచ్ బరిలోకి...
నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని పలు మండల గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని గ్రామాల్లో మాదిరిగానే ఆ గ్రామంలోనూ ఎన్నికల హడావుడి మొదలైంది. అయితే అక్కడ ఎస్సీ మహిళ కేటగిరిలో సర్పంచ్ బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది ఓ యువతి. తనే దివానం గాయత్రి. గత ఏడాది బీటెక్ పూర్తి చేసుకున్న గాయత్రి.. బెంగళూరులోని ఓ మంచి కంపెనీలో ఐదెంకెల జీతానికి ఎంపికైంది. కరోనా కారణంగా ఇంటి దగ్గరే ఉంటూ ఉద్యోగం చేస్తున్న గాయత్రి.. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం కావటంతో తమ గ్రామ సర్పంచి అభ్యర్థిగా ఎస్సీ మహిళ కేటగిరీలో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసింది.
ఈమె ఒక్కతే విద్యావంతురాలు..
ప్రస్తుతం మడిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలిచిన వారిలో ఈమె ఒక్కరే విద్యావంతురాలు కావటం విశేషం. బీటెక్ చదివి కంపెనీలోని కొలువుల కోసం క్యూ కట్టకుండా.. తాను పుట్టిన ఊరుకు ఏమైనా చేయాలనే ఉద్దేశ్యంతో అతి చిన్న వయస్సులోనే సర్పంచ్‌గా పోటీ చేసేందుకు ముందుకు వచ్చింది. చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని తమ గ్రామానికి ఉపయోగపడే విధంగా ఏదైనా చేయాలని కోరిక ఉండేదని.. బీటెక్ పూర్తయ్యే సమయానికి గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా తమ వర్గానికి అవకాశం రావటంతో.. గ్రామంలో కొందరి ప్రోద్బలంతో పోటీ చేసేందుకు సిద్ధమయ్యానంటుంది.
ఇంజనీరింగ్ చదివిన తనకు గ్రామ సమస్యలపై అవగాహన ఉందని.. తనకు అవకాశం ఇస్తే మారుమూల గ్రామమైన తమ గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని గాయత్రి ముక్తకంఠంతో చెబుతోంది. మరీ ఈ చక్కనైన చదువులమ్మకు అవకాశం దక్కుతుందా.. లేదా అనేది తేలాలంటే కొంత సమయం వేచి చూడక తప్పదు.
ఇవీ చూడండి...