MLA Kotamreddy Sridhar Reddy: వైఎస్సార్సీపీ అంటే వల్లమానిన అభిమానం.. జగన్ అంటే పిచ్చి ప్రేమ.. పార్టీని విమర్శిస్తే ప్రత్యర్థులపై ఒంటికాలుపై దూసుకెళ్లే దూకుడు స్వభావం.. ఇవన్నీ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని జగన్‌కు దగ్గర చేశాయి. పార్టీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లాలో సీఎం జగన్‌కు నమ్మినబంటుగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. కొంతకాలంగా పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదంటూ ఇటీవల కాలంలో బహిరంగంగానే విమర్శలు చేశారు. పార్టీకి ఎంతో నమ్మకంగా పనిచేసినా.. అధిష్టానం తనను నమ్మడం లేదంటూ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విమర్శలు చేశారు.
తన ఫోన్ ట్యాంపింగ్ చేస్తున్నారని.. తాను ఎవరెవరితో మాట్లాడుతున్నానో రహస్యంగా వింటున్నారని ఆయన ఆరోపించారు. అధికారపార్టీ ఎమ్మెల్యేనైన తన ఫోను ట్యాప్ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అనుమానం ఉన్నచోట కొనసాగడం కష్టమని ఆయన అనుచరుల వద్ద వాపోయినట్లు తెలిసింది. ఫోన్ ట్యాంపింగ్ సంబధించిన సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయన్నారు. వాటిని బయటపెడితే ఇద్దరు ఐపీఎస్ అధికారుల ఉద్యోగాలు పోతాయని... కేంద్రం ప్రభుత్వమే విచారణకు దిగుతుందన్నారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే షేక్ అవుతుందని హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఫోన్ ట్యాంపింగ్‌కు సంబంధించిన వివరాలన్నీ బుధవారం ఆధారాలతో సహా బహిర్గతం చేస్తానని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో ఆ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చలు జరిపేందుకు నెల్లూరు రాగా.. చర్చలు అవసరం లేదంటూ కోటంరెడ్డి ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఫోన్ల ట్యాంపిగ్ జరిగిందనేది అవాస్తవమన్న బాలినేని.. పార్టీని వీడేందుకే ఇలాంటి సాకులు చెబుతున్నారని తెలిపారు.
నెల్లూరు గ్రామీణ వైఎస్సార్సీపీ కార్యాలయం ముందు ఉన్న వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు తొలగించి కొత్త ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్ చిత్రం, వైఎస్సార్సీపీ రంగులు లేకుండానే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాత్రమే ఉన్న ఫ్లెక్సీలను ఆయన అభిమానులు ఏర్పాటు చేశారు. 2024లో నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుంచే తెలుగుదేశం అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని నాయకులు, కార్యకర్తలతో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నట్లు తెలిసింది.
ఇవీ చదవండి: