RTC Employees Worrying About Attacks: నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై మూకుమ్మడి దాడి ఉద్యోగుల్లో వణుకు పుట్టిస్తోంది. ఇన్నాళ్లూ ధైర్యంగా పనిచేశామని, ప్రస్తుత పరిస్థితుల్లో తాము డ్యూటీలు చేసే పరిస్థితి లేదంటూ ప్రగతి రథ చక్రాల సారథులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడచిన నాలుగేళ్లుగా ఆర్టీసీ ఉద్యోగులపై తరచూ ఎక్కడో ఓ చోట దాడులు జరగుతున్నాయి. సిబ్బంది గాయాల పాలవుతున్నారు. ఇవి క్రమంగా పెచ్చరిల్లి తీవ్రరూపం దాల్చుతున్న సమయాల్లో ఉద్యోగుల్లో అలజడి రేగుతోంది.
నాలుగేళ్లుగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఆర్టీసీ సిబ్బందిలో అభద్రత, ఆందోళన నెలకొంది. విధినిర్వహణలో ఉండగా వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పాలకులదే. ఉద్యోగుల్లో ధైర్యం నింపి భరోసా కల్పించాలి. అన్ని విధాలా అండగా ఉండాలి. అలా చేసినపుడే సవాళ్లతో కూడిన ఉద్యోగాన్ని ధైర్యంగా సమర్థంగా నిర్వహించగలరు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు రక్షణ కొరవడిందన్న అబిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
వరుసగా ఉద్యోగులపై దాడులు జరుగుతున్నా పట్టింకునే నాథుడే లేడంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఓ మహిళ ఏకంగా చెప్పుతో దాడి చేసిన ఘటన ఇంకా మరువక ముందే.. కావలిలో హారన్ కొట్టినందుకు డ్రైవర్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. గుంతల రోడ్లపై, డొక్కు బస్సులిచ్చినా.. సదుపాయాలులేకున్నా.. మాట మాట్లాడకున్నా.. ప్రాణాలకోడ్చి విధులు నిర్వహిస్తోన్న తమ పట్ల ప్రభుత్వం వ్యవహార శైలి ఇదేనా అంటూ సహచర ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమ సర్వీసులో ఇలాంటి పరిస్ధితి చూడలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులను ఉద్ధరించామని గొప్పలు చెప్పుకునే పాలకులు తమపై దాడులు జరిగితే కనీసం పరామర్శ చేయని వైనాన్ని చర్చించుకుంటూ వేదనకు గురవుతున్నారు. ప్రాణాలు పోయోలా దాడి చేసినా కనీసం దాడిని ఖండించేందుకు నోరు రాలేదా అంటూ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. తమకు భద్రత కరవైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగుల భద్రత గాల్లో దీపంగా మారిందని కార్మిక సంఘాల నేతలు, సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు జరిగినా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకుండా వెంటనే నిందితులను వదలేసిందని చెబుతున్నారు. ఉద్యోగుల భద్రత కోసం ఇచ్చిన నిబంధనలను ప్రభుత్వం కఠినంగా అమలు జరగకపోవడమే ప్రస్తుత పరిస్ధితులకు కారణమంటున్నారు.
విలీనం అనంతరం ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తమకు భద్రత పెరగాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా జరుగుతోందంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల్లో ధైర్యం, భరోసా నింపేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పరిస్ధితి ఇలాగే కొనగాగితే ప్రగతిరథ చక్రాలు నడిపేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్ధితి వస్తుందంటున్నారు.