నెల్లూరు జిల్లాలో 800 ప్రైవేట్ పాఠశాలల్లో 1500 మంది పనిచేస్తున్నారు. యాజమాన్యాలు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని.. జీతాలు ఇవ్వాలంటూ.. జిల్లాలో ఉపాధ్యాయులు నిరసనలు వ్యక్తం చేశారు. తమకు చిన్నపిల్లలు ఉన్నారని.. వారిని ఎలా చదివించాలో అర్థం కావట్లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయులు ఏమంటున్నారంటే...
"ఆన్ లైన్ తరగతులు కావడంతో ఒక్క సబ్జెక్టుకు ఒక్కరితోనే బోధిస్తున్నారు. మిగిలిన వారిని తొలగించారు. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే వారికి ఎక్కువ మందికి 8వేల నుంచి 10వేల రూపాయలు లోపు మాత్రమే వేతనాలు ఉంటాయి. ప్రతి నెలా వచ్చిన జీతాన్ని పొదుపు చేసుకోవడం సాధ్యం కాదు. మార్చి 22 నుంచి పాఠశాలలు మూసివేశారు. అప్పటి నుంచి వీరికి సమస్యలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటివరకూ పరిష్కారం లేకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది"- ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుల సంఘం సభ్యులు
ప్రైవేట్ ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వాలని ఉన్నత స్థాయిలో జీవోలు వచ్చాయనీ.. కానీ అవి అమలు కావడం లేదని టీచర్లు చెబుతున్నారు. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు. యాజమాన్యాలు వేతనాలు ఇచ్చేలా చూడాలని వేడుకుంటున్నారు. ఉపాధి కోసం తోపుడు బండ్లపై పండ్లు అమ్ముకుంటున్నామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఆర్థిక సహకారం అందించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: కరోనా విలయం: కోటి 21 లక్షలు దాటిన కేసులు