Illegal layouts in Nellore Urban Development Corporation: నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ అక్రమ లేఅవుట్లకు అడ్డుకట్టవేయలేక పోతున్నారు. ఆదాయం పెంచలేక పోతున్నారు. నెల్లూరు గ్రామీణం, నగరం చుట్టూ 100కు పైగా లేఅవుట్లు ఉన్నాయి. కోట్ల రూపాయలు నుడాకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా అధికార పార్టీ నాయకులు కావడంతో నుడా అధికారులు చేతులు ముడుచుకుని కూర్చున్నారు. 70శాతం లేఅవుట్లకు అనుమతులు లేవు. టీడీపీ, జనసేన, సీపీఎం నాయకులు అధికారులకు అనేక సార్లు ఫిర్యాదులు చేసినా స్పందించడంలేదు.
100కు పైగా అక్రమ లేఅవుట్లు.. నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు ముడుపులు తీసుకుని అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోకుండా వదిలివేస్తున్నారని తెలుగు యువత నాయకులు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. నుడా అధికారి బాపిరెడ్డికి వారి అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ధర్నా చేసినా, నిరసన తెలిపినా అధికారుల్లో మార్పు రావడంలేదని తెలుగు యువత నాయకులు చెబుతున్నారు. రెండు నియోజకవర్గాల పరిధిలో 100కుపైగా అక్రమ లేఅవుట్లు ఉన్నాయని. ప్రజలను మోసం చేసి అంకణం లక్షరూపాయలకుపైగా అమ్ముతున్నా నుడా అధికారులు పట్టించుకోవడంలేదని ఫిర్యాదు చేశారు. చెత్తమీద పన్ను వేస్తే ఆదాయం ఎంత వస్తుందని,అధికార పార్టీ నాయకులు వేస్తున్న అక్రమ లేఅవుట్లపై పన్నులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ధనలక్ష్మీపురం, నరుకూరు రోడ్డులో వేలాది ఎకరాల్లో ప్లాట్లు వేసి అనుమతులు లేకుండా అమ్మెస్తున్నారని చెప్పారు.
అనుమతులు తీసుకోకుండానే లేఅవుట్లు.. జిల్లాలో కొంత మంది అక్రమంగా లేఅవుట్లు వేసి వారి ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేఅవుట్ వేస్తే.. 30 అడుగుల రోడ్లు ఉండాలి.. వీటితోపాటు సామాజిక అవసరాలకు కొంత స్థలం వదలాలి. ఇవన్నీ చేస్తేనే లేఅవుట్లకు అనుమతి దొరుకుతుంది. కాని అక్కడ కొంత మంది ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అధికారులు, ప్రజాప్రతినిధుల చేతులు తడిపి వారి అండతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ఈ అక్రమాలు బయటకు వస్తే.. రాజకీయ నాయకుల అండతో వీలైనంత తక్కువగా జరిమానా విధించేలా చూసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం.. కాకుండా అక్కడ అక్రమంగా లేఅవుట్లు వేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిమీద గతంలో కలెక్టర్ చర్యలు తిసుకున్నా ఎలాంటి ఫలితం లేదు.
నెల్లూరు అర్బన్ డవలప్మెంట్ అథారిటీ పేరుతో నెల్లూరు జిల్లాను చిత్తూరు జిల్లాని కలిపితే ఏర్పడిన ఈ నుడా పరిధిలో అక్రమ లే అవుట్ల పేరుతో అధికార పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు.. వేలాది ఎకరాల్లో లేఅవుట్లు ఏర్పాటు చేస్తుంటే ఆ లేఅవుట్లకు నుడా అనుమతులు లేవు.. కాని ఇంతవరకు నుడా అధికారులు స్పిందించలేదు అంటే వాళ్లకు అనుకూలంగా ఉంటున్న పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తుంది.- కృష్ణయాదవ్, తెలుగు యువత రాష్ట్ర నాయకుడు
ఇవీ చదవండి: