Online Shopping Fraud: ఆన్లైన్ షాపింగ్.. లక్కీ డ్రా లో 11 లక్షల రూపాయలు వచ్చాయంటూ సందేశం.. కట్ చేస్తే ఆరు లక్షలు పోగొట్టుకున్న ఓ యువకుడు. సైబర్ మోసాలపై ప్రభుత్వాలు, పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ఈజీగా వచ్చే డబ్బులను వదులుకోలేని కొందరు..సైబర్ నేరగాళ్లు ఉచ్చులో చిక్కుతున్నారు. అలా చిక్కి లక్షల రూపాయలను పొగొట్టుకొని కన్నీరుమున్నీరవుతున్నాకు. తాజాగా నెల్లూరులో జరిగిన ఘటన కూడా ఇలాంటిదే.
నెల్లూరు జిల్లాకు ఓ యువకుడు ఆరు లక్షల రూపాయలు పోగొట్టుకుని అప్పులపాలయ్యాడు. నగరంలోని వెంకటేశ్వరపురం ప్రాంతంలో నివాసముంటున్న సాయి లోకేశ్. మీషో యాప్లో ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో మీషో పేరుతో లక్కీ డ్రాలో 11 లక్షల రూపాయలు వచ్చాయంటూ, వాటికి సంబంధించిన పత్రాలు పోస్టల్ ద్వారా లోకేశ్ ఇంటికి వచ్చాయి. జూన్లో వచ్చిన ఈ పత్రాలను చూసి అందులోని నెంబర్కు లోకేష్ ఫోన్ చేశాడు. 11 లక్షల రూపాయలు మీ అకౌంట్లో జమ కావాలంటే టీడీఎస్ కింద కొంత నగదు కట్టాలంటూ సైబర్ నేరగాళ్లు నమ్మబలికారు. ఆ తర్వాత మీ అమౌంట్ రెట్టింపు అయ్యిందని.. దీనికి సంబంధించిన ఆర్బీఐకి కొంత మొత్తం చెల్లించాలనడంతో వారు అడిగిన సొమ్మును విడతల వారీగా జమ చేస్తూ వచ్చారు. ఇలా దాదాపు ఒకటి కాదు రెండు కాదు.. సుమారు ఆరు లక్షల రూపాయల నగదు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత డబ్బులు జమకాకపోవడంతో మోసపోయినట్లు లోకేశ్ గ్రహించాడు. సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. లోన్ తీసుకుని ఆరు లక్షలు కట్టానని, పోలీసులు విచారించి తనకు న్యాయం చెయ్యాలని బాధితుడు సాయి లోకేశ్ కోరుతున్నారు.
"నాకు మీషో అనే యాప్ ద్వారా కొన్ని పత్రాలు.. ఇండియన్ పోస్టల్ ద్వారా వచ్చాయి. వాటిల్లో ఉన్న టర్స్మ్ అండ్ కండిషన్స్ చదివి వాళ్లకు కాల్ చేశాను. ఫొటోలు పెట్టమంటే పెట్టాను. టీడీఎస్ అమౌంట్ కట్టమన్నారు. ఆ తర్వాత ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు పడినట్లు మెసేజ్ పంపించారు. తర్వాత లక్ష కట్టమంటే కట్టాను. డబ్బులు డబుల్ అయనట్లు చెప్పి మరో లక్షా 53వేలు కట్టించుకున్నారు. ఈ విధంగా నేను ఆరు లక్షలు డబ్బులు కట్టి మోసపోయాను. ఆ డబ్బును బయట వడ్డీకి తీసుకొచ్చి కట్టాను. నాకు ఎలాగైనా న్యాయం చేయండి."-సాయి లోకేశ్, బాధితుడు
సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకున్న మహిళ: సైబర్ నేరగాళ్ల చేతిలో సాయిలోకేశ్ మోసపోగా.. మరో మహిళ మాత్రం వాళ్లు ఉచ్చులో పడకుండా తప్పించుకుంది. నగరానికి చెందిన ఓ మహిళకు 13.50 లక్షలు వచ్చాయంటూ స్క్రాచ్ కార్డు పంపి, వివరాలు అందజేయాలని కోరారు. ఇదంతా మోసమని గ్రహించిన ఆ మహిళ సైబర్ నేరగాళ్ల బారి నుంచి తప్పించుకుంది.
"మీషో నుంచి నాక్కూడా స్క్రాచ్ కార్డులు, కూపన్లు వచ్చాయి. ఫిబ్రవరిలో ఇవి వచ్చాయి. నేను వీటి గురించి తెలిసినవాళ్లందరిని సంప్రదించాను. వాళ్లంతా ఇది సైబర్ క్రైం వాళ్లు పంపిస్తారని చెప్పారు. అందువల్ల నేను దీనిని లైట్ తీసుకున్నాను."-నాగలక్ష్మి, నెల్లూరు