నెల్లూరు జిల్లాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్ఐఓటీ) ఏర్పాటు కోసం తలెత్తిన భూ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ జిల్లా రెవెన్యూ అధికారులతో పరిస్థితిపై చర్చించారు. సముద్రంపైనే ఆధారపడ్డ రంగాలకు సాంకేతిక భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో ఎన్ఐఓటీ పని చేస్తోంది. ఆ సంస్థ శాఖను నెల్లూరు జిల్లా వాకాడు మండలం తూపిలిపాలెం వద్ద ఏర్పాటు చేసేందుకు ఆరేళ్ళ కిందట అడుగులు పడ్డాయి.
500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సుమారు 200 ఎకరాల్లో ఎన్ఐఓటీని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సంకల్పించింది. అలా తూపిలిపాలెం వద్ద 97 ఎకరాలు భూమిని సేకరించి ఎన్ఐఓటీ స్వాధీనం చేసుకుంది. ఆ భూమి చుట్టూ పెన్సింగ్ వేసి షెడ్లను ఏర్పాటు చేసింది. అలాగే కోట మండలం చిట్టేడు వద్ద సిబ్బంది భవన సముదాయాన్ని నిర్మించారు. అయితే రెండుచోట్ల మరో 58 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ విషయంలోనే సంబంధిత యజమానులు కోర్టును ఆశ్రయించడంతో జాప్యం ఏర్పడింది. మొత్తంగా ఎన్ఐఓటీ భూసేకరణ వ్యవహారం మరోసారి తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: బీసీలంతా వైకాపాకు అండగా ఉండాలి: మంత్రి పెద్దిరెడ్డి