NELLORE FLOOD VICTIMS PROBLEMS: సోమశిల జలాశయం నుంచి వచ్చిన వరద నీరు.... నెల్లూరు జిల్లా సంగం మండలం కోలగట్ల, వీర్ల గుడిపాడు గ్రామాలను ముంచెత్తింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. కొందరైతే బురదలోనే బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించారు. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో... గ్రామంలోకి వచ్చిన బాధితులు... ఇళ్లల్లో ఉండేందుకు వీలు లేని పరిస్థితిలో చిన్న పిల్లలతో సహా వీధిన పడ్డారు.
మమ్మల్ని ఎవరూ పట్టించుకునేటోళ్లు లేరు. ఆ నాయకులు ఏమంటా ఉన్నరు... అంతా ఐపోయిన తర్వాత వస్తా ఉన్నరు నాయకులు. వచ్చిన తర్వాత మేం ఇళ్లు కట్టిస్తాం.. అది కట్టిస్తాం.. ఇది చేస్తాం.. మీరేం భయపడపోకుర్రి అంటాండ్రు. మేం యాడ బోయి ఉండాలా? మాకు ఇళ్లులన్నా ఎత్తున కట్టియ్యాల... లేకుంటే అలాంటి చోట్లన్న ఇప్పియ్యాల.
- వరద బాధితుడు
పూరి గుడిసెల్లో ఉండలేక.. రోడ్ల మీదే జీవనం!
NO SHELTER FOR FLOOD VICTIMS: ఎస్సీ, ఎస్టీ కాలనీల ప్రజల పరిస్థితి మరీ దారుణంగా మారింది. వరదలతో వరదమమాయమైన తమ పూరిగుడిసెలో ఉండలేక రోడ్లపైన బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. వరదల కారణంగా తాము ఇబ్బందులు పడుతున్న ఎవరు పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతం అవుతున్నారు. వరదలు వచ్చిన ప్రతిసారి తమకు కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల కారణంగా తాము సర్వం కోల్పోయామని కంటతడి పెట్టుకున్నారు. వరదల కారణంగా తాము అల్లాడుతున్న తమ గోడును పట్టించుకునే వారే కరువయ్యారని అంటున్నారు.
మేం ఎస్టీ కాలనీ అంతా అల్లాడిపోతా ఉన్నాం. అల్లో రామచంద్రా అని రోడ్డుమీదున్నం. ఒక్కో ఇంట్లో 20, 30 నుంచి 50 వేల దాకా నష్టమైంది. మేం కూలీ చేసుకొని బతికేవాళ్లం. మా పరిస్థితి ఎవరూ పట్టించుకోవట్లే. ఏ నాయకులూ పట్టించుకోవట్లే. మా బతుకులు బస్టాండ్ పాలవకుండా సూడాలా. మా ఇంట్లో కట్టుకునేందుకు బట్ట కూడా లేదు. రోడ్డు మీదున్నం సార్. మాకిలాంటి నాయకుడు కావాలని చెప్పి.. జగనన్న కావాలని చెప్పి.. అందరం వేసి గెలిపిచ్చాం. ఓట్లప్పుడే... మీకు మేమున్నాం అంటరు. అన్నీ అయిపోయిన తర్వాత మాత్రం మమ్మల్ని పట్టించుకునేవాళ్లే లేరు. - వరద బాధితురాలు
ఓట్ల కోసం వచ్చే నాయకులు ఇప్పుడు రారా..?
ఓట్ల కోసం పరుగులు తీసే నాయకులు వరదల కారణంగా ఇబ్బంది పడుతుంటే కనీసం పలకరించను కూడా తమ కాలనీ వైపు రాలేదంటూ బాధపడుతున్నారు. తాము ఇలాంటి నేతలకు ఓట్లు వేసినందుకు ఆవేదన చెందుతున్నారు. వరదలతో అతలాకుతలమైన తమ బతుకులకు రెండు వేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నారు. కనీసం తినేందుకు తిండి, తాగేందుకు నీరు లేక అల్లాడుతున్న అని అంటున్నారు. ప్రభుత్వం వరదల నుండి తమకు ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: KONDAPALLY MUNICIPAL CHAIRMAN ELECTION: భారీ బందోబస్తు నడుమ హాజరైన తెదేపా సభ్యులు