రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పతనమైపోయిందని, 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తున్నారని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అన్నారు. టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని చెప్పారు. మంచివారు ఎవరొచ్చినా తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తుందని ఆయన వెల్లడించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే చేరికపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తాను చంద్రబాబు, లోకేశ్ ను కలిపినప్పుడు ఈ విషయంపై అసలు చర్చే జరగలేదన్నారు. జిల్లా నాయకత్వంతో చర్చించకుండా రాష్ట్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోదని, కార్యకర్తలు కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు.
టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలి.. టీడీపీ జిల్లా కార్యాలయంలో రూరల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెట్టి, దౌర్జన్యాలకు పాల్పడే వారికి పార్టీలో స్థానం ఉండదని అజీజ్ చెప్పారు. తెలుగుదేశం కార్యకర్తలను వేధించిన వారికి వడ్డీతో సహా తిరిగిస్తామన్నారు. సమావేశంలో రూరల్ నాయకుల సైతం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. జగన్ కంటే కోటంరెడ్డి ప్రమాదకరమని, అజీజ్ కు కాకుండా వేరే వ్యక్తులకు పార్టీ టిక్కెట్ ఇస్తే సహించబోమని ప్రకటించారు. తమను ఇబ్బంది పెట్టిన కోటంరెడ్డిని నాయకుడిగా అంగీకరించమన్నారు. టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉంది. చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉంది.
ఇవీ చదవండి :