ఉత్కంఠ రేపిన అభ్యర్థుల ఎంపిక...
నెల్లూరు లోక్సభస్థానానికి ప్రధాన పార్టీ అభ్యర్థుల ఎంపిక అనూహ్య పరిణామాల మధ్య జరిగింది. తెదేపా తరపున బరిలో ఉన్న మస్తాన్‌రావు... కావలి అసెంబ్లీ కోసం గ్రౌండ్ సిద్ధం చేసుకుంటూ ముందుకుసాగారు. నెల్లూరుగ్రామీణం స్థానానికి ఆదాల ప్రభాకర్‌రెడ్డిని తెలుగుదేశం అధిష్ఠానం పచ్చజెండా ఊపింది. 10 రోజులు తెదేపా అభ్యర్థిగా ప్రచారం చేసిన ఆదాల... రాత్రికిరాత్రే వైకాపాలో చేరి నెల్లూరు ఎంపీగా పేరు ఖరారు చేసుకున్నారు. ఈ పరిణామంతో కంగుతిన్న అధికార పార్టీ... వ్యూహాం మార్చింది. కావలి ఆశపడుతున్న బీదా మస్తాన్‌రావును నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థికు పంపించి... ప్రత్యర్థులను పరుగులు పెట్టించింది.
తెదేపా బీసీ అభ్యర్థి అస్త్రం..
నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7నియోజకవర్గాల్లో 50 శాతం బీసీ ఓటర్లే. అందుకే వెనబడిన వర్గానికి చెందిన బీదా మస్తాన్‌రావును తెరపైకి తీసుకొచ్చింది తెదేపా. కావలి, కందుకూరు నియోజవర్గాల్లో ఉన్న తన సామాజిక వర్గం, ప్రభుత్వం పథకాలు, అభివృద్ధి పనులే గెలిపిస్తాయని మస్తాన్‌రావు ధీమాతో ఉన్నారు.
ప్రజాదరణతోనే విజయం....
తెలుగుదేశంలో సహకారం లేనందునే బయటకు రావాల్సి వచ్చిందని ప్రచారం చేస్తున్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి. పార్లమెంట్ స్థానం పరిధిలోని కోవూరు, నెల్లూరు గ్రామీణంలో ఉన్న పట్టుతో విజయంపై ఈయనా ధీమాగా ఉన్నారు. జగన్‌పై ఉన్న ప్రజాదరణ అదనపు ఆకర్షణగా చెబుతున్నారు ఆదాల.
ఇరువైపులాబలమైన అభ్యర్థులు..
నెల్లూరు పార్లమెంట్‌ను చేజిక్కుంచుకోవాలంటే ఆ సీటు పరిధిలోని నియోజకవర్గంలోని అభ్యర్థులకు వచ్చే ఓట్లే కీలకం. ఆయా స్థానాల్లో తెదేపా, వైకాపా తరపున బలమైన అభ్యర్థులే పోటీలో ఉన్నారు. ఇరువురు పార్టీ సొంత బలంతోపాటు ప్రత్యర్థుల బలహీనతలు తెలుసుకొని ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఇక్కడ 13 మంది పోటీలో ఉన్నారు. సీపీఎం నుంచి చండ్రా రాజగోపాల్, కాంగ్రెస్ నుంచి చేవూరు దేవకుమార్ రెడ్డి, భాజపా నుంచి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఓటు పరీక్షకు నిలబడ్డారు.
అభ్యర్థుల ఎంపిక విషయంలోనే ఆసక్తిరేపిన నెల్లూరు పార్లమెంట్ సీటులో గెలుపు మజిలీ చేరుకునే విజేత ఎవరనే ఆసక్తిపై తీవ్ర చర్చ జరుగుతోంది.