ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో ‘నాడు-నేడు’ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యారంగంపై ఖర్చును సామాజిక పెట్టుబడిగా భావించి మానవ వనరుల అభివృద్ధిగా చూడాలనే ఉద్దేశంతో మూడేళ్లపాటు మూడు విడతలుగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనులు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పనులు చేసే బాధ్యతను స్థానిక పాఠశాలల పిల్లల తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సచివాలయ ఇంజినీరింగ్ సహాయకులు బ్యాంకుల్లో ఉమ్మడి ఖాతాను ఏర్పాటు చేసి అభివృద్ధి పనులకు అయ్యే ఖర్చును వారి ఖాతాల్లోకి జమ చేస్తారు. ఈ పనులన్నింటిని పర్యవేక్షించడానికి వివిధ విభాగాలు ప్రత్యేకాధికారులను కూడా నియమించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మొదటి విడత నాడు-నేడు పనులు జులై నెలాఖరుకు పూర్తి చేయాలి. జులై 21న నాటికి అధికారిక లెక్కల ప్రకారం పనులకు కేటాయించిన మొత్తంలో సుమారు 50 శాతం నిధులు కూడా ఇంకా ఖర్చుకాలేదు. జిల్లా అధికారులు మండలాల వారీగా అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి జిల్లాలో 22 మండలాలను ఎస్‌ఎస్‌ఏకి, పంచాయతీరాజ్‌కి 15 మండలాలు, ఏపీడబ్ల్యుఐడీసీ 6 మండలాలు, ట్రైబుల్ వెల్ఫేర్‌కి 3 మండలాలను పర్యవేక్షించడానికి అప్పగించారు. చేపట్టిన అభివృద్ధి పనులకు మండలాల వారీగా గ్రేడింగ్ ఇవ్వడంతో మండలాధికారులు, ప్రత్యేకాధికారులు పాఠశాలల చుట్టూ పర్యటిస్తూ పనుల్లో వేగం పెంచుతున్నారు. ఈనెల 31 నాటికి పనులు పూర్తికావాలంటే పనుల్లో నాణ్యత లోపిస్తోందని ప్రజలు వాపోతున్నారు.
![nellore nadu nedu building works](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/nlr5_2307newsroom_1595500907_58.jpg)
ఈ విధానంలో పనుల్లో వేగం దస్త్రాల్లో మాత్రమే కనిపిస్తుంది. జిల్లా స్థాయిలోనే కొన్ని, మండల స్థాయిలో కొన్ని పనులకు కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేసి చేర్చడానికి గుత్తేదారులకు అప్పగించారు. దీంతో అభివృద్ధి పనులకు కావాల్సిన సామగ్రిని పాఠశాలల స్థలంలోకి చేర్చినందుకు సంబంధిత గుత్తేదారుడికి బిల్లులు చూపడంలో ఆ పనులు పూర్తయినట్లుగా తమ మండలం గ్రేడింగ్‌లో మెరుగుగా కనిపిస్తోంది. దీంతో సామగ్రి అయితే పాఠశాల ఆవరణంలోకి చేరుతున్నాయి కాని పనుల్లో మాత్రం ఇంకా వేగం కనిపించడం లేదనేది ప్రజల్లో కనిపిస్తున్న విమర్శ.
సకాలంలో పూర్తికి చర్యలు
ఈ నెలాఖరులోగా జిల్లాలోని నాడు-నేడు కార్యక్రమానికి ఎంపిక చేసిన పాఠశాలల పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. అయితే కొంత సిమెంట్ కొరత వల్ల అక్కడక్కడ పనులు ఆలస్యంగా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చింది. పనులు వేగవంతమయ్యేలా అధికారులను ఆదేశించాం.
- జనార్దనాచార్యులు, డీఈవో, నెల్లూరు
కొన్ని పరిశీలిస్తే..
![nellore nadu nedu building works](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/nlr2_2307newsroom_1595500907_702.jpg)
ఈ చిత్రంలో కనిపిస్తున్నది కలువాయి మండల కేంద్రంలోని ప్రధాన ప్రాథమిక పాఠశాల. మండలంలో మొత్తం 18 పాఠశాలలు ‘నాడు-నేడు’ పథకంలో అభివృద్ధికి ఎంపికయ్యాయి. ఇది కూడా అందులో భాగమే. ఇంకా ఇక్కడ పాత ప్రహరీనే కనిపిస్తోంది. ఈ గోడను తొలగించి పాఠశాల ఆవరణాన్ని పెంచి ప్రహరీ నిర్మించాల్సి ఉంది. ఇంకా ఆ దిశగా అడుగులైతే పడలేదు.
![nellore nadu nedu building works](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/nlr3_2307newsroom_1595500907_519.jpg)
గూడూరు మండలం మిట్టాత్మకూరులోని ఎస్టీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం ఇది. ఈ పాఠశాల నాడు-నేడు పథకంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు ఎంపిక చేశారు. అయితే అధికారుల నిర్లక్ష్యంతో ఇక్కడ పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. పలు చోట్ల పనులు దాదాపు పూర్తికావస్తున్నా ఇక్కడ మాత్రం పాఠశాల రూపురేఖలు ఇంకా మారలేదు. ఇదే పరిస్థితి మండలంలోని పలు ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉన్నాయి. స్థానిక ఉపాధ్యాయుల చొరవ, అధికారుల పర్యవేక్షణ, గుత్తేదారుల అలసత్వంతో నత్తతో పోటీ పడి పనులు సాగుతున్నాయి.
![nellore nadu nedu building works](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/nlr4_2307newsroom_1595500907_246.jpg)
డక్కిలి మండలంలోని శ్రీపురం పంచాయతీ ఎస్సీకాలనీలోని ప్రాథమిక పాఠశాల ఇది. మండలంలో నాడు-నేడు పథకంలో అభివృద్ధి చేయడానికి 24 పాఠశాలలు ఎంపిక కాగా అందులో ఇది ఒకటి. ఇటీవల వరకు ఈ పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టడానికి నాయకులు, పిల్లల తల్లిదండ్రుల కమిటీ మధ్య సఖ్యత కుదరక పనులు ప్రారంభించలేదు. జిల్లా అధికారులు జోక్యం చేసుకొని ఇటీవలే ఇక్కడ పనులు ప్రారంభించారు. మరుగుదొడ్డి నిర్మాణం పనులు ఇంకా పునాధుల దశలోనే ఉన్నాయి.
ఇదీ చదవండి: ప్రకృతి సేద్యం.. ఆరోగ్య భాగ్యం