నెల్లూరంటే రుచికి, శుచికి పెట్టింది పేరు. నగరంలో 50కిపైగా పెద్ద రెస్టారెంట్లు, 100కుపైగా హోటల్స్. అదే స్థాయిలో మాంసం దుకాణాలు ఉన్నాయి. జిల్లా కేంద్రం కావడంతో 46మండలాల నుంచి ప్రజలు వివిద పనులపై నిత్యం నగరానికి వస్తుంటారు. అలా వచ్చిన వారు ఆ పూటకి హోటల్స్, రెస్టారెంట్లలో భోజనం చేస్తుంటారు. వీరికి కల్తీ ఆహారాన్ని అందిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫ్రీజర్లు ఏర్పాటు చేసుకుని మాంసాన్ని వారాల తరబడి నిల్వ చేస్తున్నారు. పాడైపోయినా వాటినే వండుతున్నారు. ఈ నిర్వాకంపై నగరపాలక సంస్థ.. రెండు నెలలుగా హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు చేసింది. అనేక చోట్ల పెద్దమొత్తంలో పాడైన మంసాన్ని వినియోగదారులకు వడ్డిస్తున్నారని గుర్తించారు.
ప్రజల ఆరోగ్యాలను పెట్టుబడిగా పెడుతున్న హోటళ్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 2నెలలుగా చేస్తున్న దాడుల్లో భారీగా నిల్వచేసిన ఆహారపదార్థాలను స్వాధీనం చేసుకున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ తెలిపారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే హోటళ్లను సీజ‌్ చేస్తామని హెచ్చరించారు. దాడులను ఇలానే కొనసాగించాలంటున్న నగరవాసులు..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.