Nari sankalpa deeksha: రాష్ట్రాన్ని పాలిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని చూస్తే అవినీతి, అసమర్థ నేతల పాలన ఎలా ఉంటుందో ఇట్టే అర్థవుతుందని తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక వైకాపా ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ నెల్లూరులో అనిత నారీ సంకల్ప దీక్ష చేశారు. సొంత అమ్మ,చెల్లికే న్యాయం చెయ్యలేని జగన్ రాష్ట్ర మహిళలకు ఏమి న్యాయం చేస్తారని ప్రశ్నించారు. నెల్లూరుకు చెందిన పొణకా కనకమ్మను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి మహిళా ప్రభుత్వంపై పోరాటం చెయ్యాలన్నారు.
మద్యపాన నిషేధమని మాయ మాటలు చెప్పి కల్తీ మందులతో నిరుపేదల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని వివిధ జిల్లాల మహిళా నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదని విమర్శించారు. వైకాపా ప్రభుత్వంలో మహిళలకు రక్షణ శూన్యంగా మారిందని తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. వైకాపా వైఫల్యాలపై జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలోనూ నారీ సంకల్ప దీక్షలు నిర్వహించేందుకు సిద్ధమని మహిళా నేతలు స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలే జగన్ సీఎం పీఠం నుంచి దించుతారన్నారు.
ఇదీ చదవండి: Venkaiah Naidu: 'రాజకీయాల్లో కులం, డబ్బు, నేరచరిత్ర కీలకంగా మారాయి'