Nara Lokesh Yuvagalam Padayatra: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేపట్టిన నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముమ్మరంగా సాగుతోంది. లోకేశ్‌కు ప్రజలు అడుగడుగునా స్వాగతాలు పలుకుతున్నారు. పాదయాత్రలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గంలో రైతులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. జగన్ పాలనలో నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. నకిలీ విత్తన మొక్కలతో ఇబ్బందులు పడుతున్నట్లు అన్నదాతలు వివరించారు. తెగుళ్లు పెరిగిపోయాయని.. తమను పట్టించుకున్నవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఏం మందు కొనాలో చెప్పే నాథుడు లేడని.. పురుగుల మందులు, విత్తనం, ఎరువులు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని లోకేశ్‌కు రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు.
అలాగే మామిడి రైతులు కూడా తాము పడుతున్న అవస్థలను లోకేశ్‌కు వివరించారు. తీవ్రంగా నష్టపోయామని.. వైసీపీ ప్రభుత్వం తమను ఆదుకోలేదని ఆవేదన చెందారు. జగన్ ప్రభుత్వం ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులు ఆపేసిందని.. రైతు భరోసా కేంద్రాల్లో ముందు డబ్బులు కడితేనే విత్తనాలు ఇస్తున్నారని.. అవి కూడా నాణ్యత ఉండటం లేదని లోకేశ్‌కు వివరించారు. సన్ ఫ్లవర్ రైతులకి ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదని.. వరికి గిట్టుబాటు ధర ఉండటం లేదని.. ప్రభుత్వం కొన్నా డబ్బులు ఇవ్వడం లేదని.. దళారుల చేతిలో మోసపోతున్నాం అని రైతులు వివరించారు.
రైతుల సమస్యలను సానుకూలంగా విన్న యువనేత.. వారినిఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ హయాంలో రైతులకు ఎంతో మేలు జరిగిందని గుర్తు చేశారు. 50 వేల రుణమాఫీ చేశామన్నారు. జలసిరి ద్వారా మెట్ట ప్రాంత రైతులకు మేలు చేసినట్లు చెప్పారు. రైతు రాజ్యం సాగిస్తామని చెప్పుకునే CM జగన్.. ఇప్పుడు ఏపీని అన్నదాతలు లేని రాజ్యంగా మారుస్తున్నారని మండిపడ్డారు. అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలోనే రాష్ట్రం ఇప్పుడు మూడో స్థానంలో ఉందన్నారు. రైతు రథాలు, ఇన్‌పుట్ రాయితీలను జగన్ సర్కార్ తొలగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక సాగు నీటి ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తామన్నారు. చంద్రన్న బీమా పథకాన్ని తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అలాగే నిమ్మ రైతుల కష్టాలు తనకి తెలుసని.. వారి కోసం రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మెరుగైన రకాల మొక్కలు తీసుకొస్తామని.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి మార్కెట్‌తో లింక్ చేసి రైతులకు మంచి రేటు వచ్చేలా చేస్తామని లోకేశ్ అన్నారు. అలాగే టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 90 శాతం సబ్సిడీతో డ్రిప్ అందజేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
నేటి పాదయాత్ర వివరాలు: నేడు లోకేశ్ యువగళం పాదయాత్ర సాయంత్రం నాలుగు గంటలకు వెంకటగిరి నియోజకవర్గం పెనుబర్తి క్యాంపు సైట్ నుంచి ప్రారంభమవుతుంది. 5గంటలకు ఓబులాయపల్లి, అఖిలవలస, గుండువోలు, ఏపూరు, వెలిగోను జంక్షన్ మీదుగా రాపూరు శివారులోని విడిది కేంద్రానికి చేరుకుని అక్కడ బస చేస్తారు.