నెల్లూరు జిల్లా నగరపాలక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక లోపాల కారణంగా పోలింగ్.. ఆలస్యంగా ప్రారంభం అయింది. జిల్లాలోని గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ చక్రధర్ బాబు ఈ పోలింగ్‌ను వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. క్యూలైన్లు ఓటర్లు ఎక్కువ సేపు వేచి ఉండకుండా, త్వరితగతిన ఓటింగ్ జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఎండవేడిమిని దృష్టిలో ఉంచుకొని అన్ని సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
సూళ్లూరుపేట..
సూళ్లూరుపేట పురపాలక సంఘం పరధిలోని 14 వార్డులు ఏకగ్రీవం అవ్వగా.. 11 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వేకువ జాము నుంచే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వృద్ధులు.. బంధువుల సహయంతో వచ్చి ఓటు వేస్తున్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా.. పోలీసులు పటిష్టబందోబస్తు నిర్వహిస్తున్నారు.
వెంకటగిరి
వెంకటగిరిలో పుర ఎన్నికలు పటిష్ట బందోబస్తు నడుమ నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఇన్ఛార్జ్ డీఎస్పీ మల్లికార్జున రావు పర్యవేక్షిస్తున్నారు. పలు ప్రాంతాల్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఎన్నికల సందర్భంగా పట్టణంలోని అన్ని దుకాణాలు మూత వేయాల్సి రావడంపై స్థానికులు ఆవేదన చెందుతున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు... కూడా తెరవకుండా అధికారులు ఆదేశాలు జారీ చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంగా పట్టణంలో మరో లాక్డౌన్ పరిస్థితి కనిపిస్తోంది. బంగారుపేట(1వ) వార్డులో వృద్ధ మహిళలను సీఐ దశరథ రామిరెడ్డి.. దగ్గరుండి ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు.
ఆత్మకూరు
ఆత్మకూరు పరిధిలో సాంకేతిక లోపాల కారణంగా.. పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం అయింది. ఈ మున్సిపాలిటీ పరిధిలో 23 వార్డులు ఉండగా.. 6 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 17 వార్డులకు ఓటింగ్ జరుగుతోంది.
ఇదీ చదవండీ.. ఎన్నికలను బహిష్కరించిన నూకలపాలెం గ్రామస్థులు