పంచాయతీ ఎన్నికల సమరం మొదలైంది. తొలి విడతలో కావలి డివిజన్ పరిధిలోని 167 గ్రామ పంచాయతీలకు నామపత్రాల దాఖలు కార్యక్రమం ఆదివారంతో పూర్తయింది. రెండో విడతలో భాగంగా ఆత్మకూరు డివిజన్‌లో ఈ ప్రక్రియ రెండో తేదీ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. నాలుగు దశల్లో జరిగే ఎన్నికల్లో 15,72,800 మందిని ఓటర్లుగా అధికారులు నిర్ధరించారు. ఆ మేరకు గ్రామాల వారీగా జాబితాలు సిద్ధం చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. వాటిల్లో తప్పులు చోటు చేసుకోవడం తలనొప్పిగా మారింది.
సంగంలో 8484 మంది ఓటర్లతో జాబితా వెలువడింది. ఇందులో ఒకటో ఓటరుగా, రెండో ఓటరుగా అయ్యగారి శ్రీధర్‌రెడ్డి పేరు, ఫొటోతో సహా యథాతథంగా ఉండటం ఉంది. జాబితా తప్పుల తడకగా ఉందనేందుకు ప్రారంభమే ఓ ఉదాహరణగా నిలిచింది.
199 ఓటరుగా కె.శ్యామలమ్మ పేరుంది. ఈమె మూడేళ్ల నాడు మృతి చెందారు. పైగా ఆమె ఫొటోకు బదులుగా కె.హరిత అనే మహిళ ఫొటో, ఆమె భర్త హరిరెడ్డి అనే వివరాలున్నాయి.
1850 ఓటరుగా నమోదైన సురేష్‌బాబు మలినేని గత ఏడాది ఏప్రిల్ పదో తేదీ మృతి చెందారు. ఆయన పేరు యథాతథంగా కొనసాగుతోంది.
వెంగారెడ్డిపాళెంలో 21 నంబరు ఓటరుగా ఉన్న యాకసిరి వెంగమ్మ పేరును వెంగయ్యగా మార్చి మహిళను పురుషుడుగా నమోదు చేశారు. ఇదే గ్రామంలో 29వ నంబరు ఓటరు చెంచమ్మ ఇంటి పేరు గంధళ్ల అయితే, జన్నిగా నమోదు చేశారు.
సహాయ కేంద్రానికి ఫోన్ చేయవచ్చు - ఎం.ధనలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి
ముందుగానే ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయా ప్రాంతాల, గ్రామాల ఓటరు జాబితాలను వెల్లడించాం. ఆ సమయంలో వచ్చిన అభ్యంతరాలను సరి చేసిన తర్వాతే... తిరిగి ఓటరు జాబితాలను ముద్రించి గ్రామాలకు పంపించాం. ఇంకా సమస్యలు ఉన్న వారు పంచాయతీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన ఫిర్యాదులు, సహాయ కేంద్రానికి ఫోన్ చేసి అక్కడి అధికారుల సలహాలు తీసుకోవచ్చు.
సహాయ, ఫిర్యాదుల కేంద్రం నంబర్లు 70367 47605, 70367 47608, 91211 02066, 0861 2952222
ఇవీ చూడండి...: ఎన్నికల వ్యూహంపై వైకాపా ముఖ్యనేతల భేటీ