సీఎం జగన్‌పై తెదేపా నేతల వ్యాఖ్యలపై మంత్రులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. ముఖ్యమంత్రిని బూతులు తిట్టడం దారుణమన్నారు. పరుష పదజాలంతో చంద్రబాబును తిడితే ఊరుకుంటారా..? అని ప్రశ్నించారు.
అందరూ ఖండించాలి: మంత్రి బాలినేని
సీఎంపై పట్టాభి వ్యాఖ్యలను అన్ని పార్టీల వారూ ఖండించాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. ఇలాగే వదిలేస్తే రేపు అన్ని పార్టీల వారిని ఇలాగే మాట్లాడతారని.. అప్పుడు జరిగే వాటికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి బూతులు తిట్టడం దారుణమన్నారు.
తోలు తీస్తాం: మంత్రి అనిల్ కుమార్
తెదేపా నేతలపై మంత్రి అనిల్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరులో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వమే డ్రగ్స్‌తో రాష్ట్రానికి సంబంధం లేదని చెబుతుంటే.. దానిని తమకు అంటగట్టడమేంటని నిలదీశారు. తాము ఎంతో సంయమనంతో ఉన్నామని.. తమ జోలికి వస్తే తోలు తీస్తామని హెచ్చరించారు. సీఎంను తెదేపా నేతలు నోటికివచ్చినట్లు మాట్లాడితే మౌనం వహించిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ప్రజాస్వామ్యం కూనీ అవుతుందనటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాన్వాయ్‌తో పాటు పోలీసులను పక్కనబెట్టి.. నెల్లూరులోనే వారం రోజులు ఉంటానని వ్యాఖ్యానించారు. ఎవరైనా తన ఇంటి మీదకుగానీ.. కార్యకర్తల జోలికి వస్తే తాడోపేడో తేల్చేస్తామంటూ సవాల్ విసిరారు.
తెదేపాను నిషేధించాలి: మంత్రి బొత్స
తెదేపా ఆందోళనలపై మంత్రి బొత్స(minister botsa) కీలక వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో స్వచ్ఛ వాహనాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి.. తెదేపాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరతామన్నారు. మావోయిస్టు పార్టీకి తెదేపాకు మధ్య తేడా లేదంటూ ఘాటుగా విమర్శించారు. తెదేపా అధికార ప్రతినిధి వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానమేంటో చెప్పాలన్నారు. సోము వీర్రాజు చంద్రబాబుకు వత్తాసు పలకడంలో ఆంతర్యమేంటని బొత్స ప్రశ్నించారు. భాజపాతో ఉన్నానంటూ చంద్రబాబు పార్ట్‌నర్ పవన్ సమర్థన సిగ్గు చేటన్నారు.
ప్రణాళిక ప్రకారమే : ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
రాజకీయ ఉనికి కోసమే తెలుగుదేశం నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఓ పథకం ప్రకారమే నిన్న తెదేపా నేతలు వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలు తనపై తరచూ విమర్శలు చేసినప్పుడు ఒపిగ్గా ఉండమని పార్టీ అధినేత తమకు చెప్పారని తెలిపారు. ఆ విమర్శలు, వ్యాఖ్యలను కార్యకర్తలు భరిస్తూ వచ్చారన్నారు. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నా సంయమనం పాటించారని.. వాటిని తారస్థాయికి తీసుకెళ్లినప్పుడు ఓపిక నశించి కొందరు ఆవేదన వ్యక్తం చేయడం సహజమని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబు ప్రణాళిక ప్రకారమే పట్టాభితో ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయించారని ఆయన విమర్శించారు.
ఇదీ చదవండి