శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకే ప్రత్యేకమైన 'ఎడగారు' వరి ధాన్యసేకరణ సమస్యను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తనదైన శైలిలో పరిష్కరించారు. అటు వరి పండించిన రైతాంగం, ఇటు మిల్లర్లు నష్టపోని విధంగా ధాన్య సేకరణ జరిగేలా దిశానిర్దేశం చేశారు. ధాన్యం సేకరణలో కీలకమైన తేమశాతం, పుట్టి కొలతలపై మంత్రి మేకపాటి హైదరాబాద్లోని తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులు, రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు.
మంత్రి చొరవ...
సహజంగా ఒక పుట్టికి 850 కిలోలు కాగా... జిల్లాలో కొందరు మిల్లర్లు, దళారులు తేమ పేరుతో రైతుల నుంచి ఇంకా ఎక్కువ కేజీల ధాన్యాన్ని అదనంగా తీసుకుంటున్న అంశం మంత్రి మేకపాటి దృష్టికి వచ్చింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైతులు దాదాపు 3 లక్షల ఎకరాలలో వరి పంటసాగు చేసినా... సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు మిల్లర్లు సమాయత్తమయ్యారు. కానీ ధాన్యసేకరణలో మాత్రం అడుగు ముందు పడక అన్నదాతలు నష్టపోతున్నట్లు తెలుసుకున్న మంత్రి మేకపాటి.. ఈ విషయంపై ప్రత్యేక చొరవ చూపారు. ఇప్పటికే 17 శాతం తేమశాతం ఉన్నా ధాన్యాన్ని సేకరించాల్సి ఉంది. వర్షాలు, వాతావరణ సంబంధిత అంశాల వల్ల 25 శాతం తేమ ఉన్నా ధాన్యం సేకరించాలని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీని వల్ల మిల్లర్లకు నష్టం కలుగుతున్న తరుణంలో.. ఎన్ఎల్ఆర్-34449 రకం, ఎన్ఎల్ఆర్-3354 రకమైతే ఒక పుట్టికి 1,020 కిలోలు సేకరించాలని మంత్రి మేకపాటి ఆదేశించారు. ఎంటీయూ-1010 రకం ధాన్యమైతే 960 కేజీలు చొప్పున కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల ధాన్యం సేకరించాలని మంత్రి మేకపాటి మార్గనిర్దేశం చేశారు.
మంత్రి గౌతమ్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో రైతు సంఘాల నాయకులు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రైస్ మిల్లర్ల సహకార సంఘాల నేతలు, నెల్లూరు రూరల్ ఏఎమ్ సీ ఛైర్మన్, పౌరసరఫరాల శాఖ డీఎం కేఎం రోజ్ మాండ్, డీఎస్ బాలకృష్ణారావు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మీ అప్పుల తిప్పల కోసం రైతుల ప్రాణాలకే ముప్పు తెస్తారా?: యనమల