కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశాక తొలిసారి నెల్లూరు రావడం... అదే రోజు అదే నగరంలో మాజీమంత్రి అనిల్ సభ నిర్వహణ ప్రకటనతో వర్గపోరు అనుమానాలు ఊపందుకున్నాయి. బల ప్రదర్శనకు ప్రయత్నిస్తున్నారా అనే ప్రశ్నలూ వచ్చాయి. పోలీసులు కూడా సిబ్బందిని భారీగా మోహరించారు. ఈ క్రమంలో....ఇద్దరు నేతలతోనూ పార్టీ పెద్దలు మాట్లాడినట్లు సమాచారం. ఎవరి కార్యక్రమాలు వారు....వివాదస్పద వ్యాఖ్యలు చేయకుండా నిర్వహించుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. ఫలితంగా వర్గపోరేమీ లేదన్నట్లుగా....కాకాణి, అనిల్ సభలు ముగించారు.
అంతకుముందు మంత్రిస్థాయిలో తొలిసారి జిల్లాకు వచ్చిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి....రోడ్‌షో అనంతరం సభ నిర్వహించారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే నగర ఎమ్మెల్యేఅనిల్ కుమార్ సహా గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి హాజరవలేదు. ఈ క్రమంలో మంత్రిగా అందరినీ కలుపుకొని పనిచేస్తానంటూ కాకాణి స్పష్టం చేశారు
వ్యవసాయ శాఖ మాత్రమే కాకుండా నీటిపారుదలశాఖపైనా సమీక్షించాలని మంత్రి కాకాణికి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనుల్ని పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు.
ఇక మంత్రివర్గం నుంచి తనను తొలగించినందుకు బాధపడలేదని మరో సభలో మాజీమంత్రి అనిల్ స్పష్టం చేశారు. తన వయసు కేవలం నలభై రెండేనన్న అనిల్... జగన్ మళ్లీ మళ్లీ విజయం సాధిస్తే తనకు పదవి దక్కొచ్చన్నారు.
ఇదీ చదవండి: నెల్లూరులో ఉన్నది ఒకే వర్గం.. నాకు నేనే పోటీ : మాజీ మంత్రి అనిల్