వైద్యఆరోగ్య రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తూ... ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో తొలి ఏడాది-జగనన్న తోడు, మనపాలన-మీ సూచన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ... అర్హులైన వారికి లబ్ది చేకూర్చేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.
వాలంటరీ వ్యవస్థను వినియోగించుకుంటూ వైద్య పథకాలపైన ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వైద్యశాలల్లో పనిచేసేందుకు వైద్యులు ముందుకు రాకపోవడం బాధాకరమని... ఈ పరిస్థితిలో మార్పు రావాలని ఆకాంక్షించారు. ఏరియా ఆస్పత్రుల్లో కూడా మెరుగైన వసతులు, వైద్య సదుపాయాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 9 వేల మంది సిబ్బందిని వైద్యశాఖలో నియమించడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.