నెల్లూరు జిల్లాలో పెన్నా నదిపై 150 కోట్ల వ్యయంతో నూతన వంతెన నిర్మాణం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. పెన్నా బ్యారేజీ పనులను పరిశీలించిన ఆయన.. ఇటీవల వచ్చిన భారీ వరదల కారణంగా బ్యారేజీ పనుల్లో కాస్త జాప్యం జరిగిందన్నారు. జిల్లాలో ఇరిగేషన్ పనులకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని.., పెండింగ్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
భారీ వరద వచ్చినా ప్రజలకు ఇబ్బంది లేకుండా, 75 కోట్లతో ఫ్లడ్ బ్యాంక్ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. జాఫర్ సాహెబ్ కెనాల్ రీటైనింగ్ వాల్ నిర్మాణానికి 45 కోట్లు మంజూరు చేశామన్నారు. గత రెండేళ్లలో నగరంలో 350 కోట్లకు పైగా నిధులు వెచ్చించి, అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
ఇదీచదవండి: 'టీఎన్ఎస్ఎఫ్ నేతలపై తప్పుడు కేసులు పెట్టడం హేయమైన చర్య'