Kotamreddy Sridhar Reddy house arrest: ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడానికే జలదీక్ష రూపంలో ఆందోళనకు దిగానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పారు. శాంతియుత నిరసనను ప్రభుత్వం గృహనిర్బంధంతో అడ్డుకోవడం సరికాదని ఆయన అన్నారు. ఇంట్లోనే చేపట్టిన నిరాహార దీక్ష నిరసన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎమ్మెల్యేను గృహ నిర్బంధంలో ఉంచారు. అక్కడ కూడా ప్రభుత్వ తీరును విమర్శిస్తూ అభిమానులు, నాయకులు బైఠాయించారు. నిరసన నినాదాలతో 12గంటలు నెల్లూరు మారుమోగిపోయింది. పెద్ద ఎత్తున పోలీసులు రావడంతో అనేక మంది నాయకులు బయటనే నిలిచిపోయారు. అభివృద్ధికోసం నిరసనలు కొనసాగుతాయని కోటంరెడ్డి ముగింపు సభలో స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని అనేక సార్లు కలిసి అడిగినా స్పందన లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి వాపోయారు.
ప్రయోజనం శూన్యం.. ముఖ్యమంత్రి సంతకానికే విలువ లేకుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎం జరుగుతోందని కోటంరెడ్డి మండిపడ్డారు. నెల్లూరు గ్రామీణం సమీపంలోని పొట్టేపాలెం కలుజు, ములుమూడి కలుజు వద్ద వంతెనలు నిర్మించాలని కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నానని, ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా నెరవేరలేదని విమర్శించారు. దానిని నిరసిస్తూ ఈ రోజు చేపట్టిన 8 గంటలు జలదీక్షను పోలీసులు భగ్నం చేశారని తెలిపారు. గృహ నిర్భంధంలో ఉంచినంత మాత్రాన నిరసనలు ఆగవని, ఇంకా వేగంగా ముందుకు దూసుకుపోతానని చెప్పారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం పరిధిలో అనేక ప్రజా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని ఆయన తెలిపారు. మూడున్నరేళ్లుగా వాటిని పరిష్కరించాలని కలెక్టర్ నుంచి సీఎం వరకు అందరినీ కలిసినా ప్రయోజనం శూన్యమని.. ఆవేదన వ్యక్తం చేశారు.
పోరాటం మాత్రం ఆగదు.. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని, వాటికి ఇంకా పరిష్కారం లభించలేదని ఎమ్మెల్యే కోటంరేడ్డి తెలిపారు. పొట్టేపాలెం కలుజు నాలుగు నియోజకవర్గాల ప్రజల సమస్య.. వంతెన కోసం జలదీక్షకు అనుమతి కోరితే పోలీసులు నుంచి సమాధానం లేదని చెప్పారు. ఇవాళ మాఫియా డాన్ ఇంటికి వచ్చినట్లు నా ఇంటికి పోలీసులు వచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు నాకు మద్దతుగా నిలిచారని, వంతెన నిర్మాణం కోసం పోరాటం మాత్రం ఆగదు అన్నారు. అమరావతిలో గాంధీగిరి పద్ధతిలో నిరసనలు కూడా చేస్తానని చెప్పారు. నెల్లూరు రూరల్‌లో ఈ నెల 13 నుంచి 'జనం మాటలు విందాం రండి' అనే కార్యక్రమం చేపడతానని చెప్పారు.
జల దీక్షని మీరు భగ్నం చేశారు.. ములుమూడి కలుజు మీద బ్రిడ్జి సాధన కోసం పొట్టేపాలెం, తాడిపర్తి రోడ్డు కోసం సాగించే పోరాటం ఆగే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి సంతకానికి విలువ లేకపోయింది.. ఆంధ్రప్రదేశ్‌లో ఎం జరుగుతోందని నేను అడుగుతున్నాను. త్వరలో జనం మాటలు విందాం రండి అనే కార్యక్రమం చేపట్టబోతున్నాను.-కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే
ఇవీ చదవండి: