రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సంచలనం రేకెత్తించిన నకిలీ చలానాల వ్యవహారం నెల్లూరు జిల్లా ఉదయగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికీ పాకింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలాన్లను సృష్టించి రూ. 7.20 లక్షల పైచిలుకు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయగిరి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు 2019 ఏప్రిల్ నుంచి 2021 జూలై వరకు రిజిస్ట్రేషన్లు జరిగిన డాక్యుమెంట్లకు సంబంధించిన చలాన్లను తనిఖీ చేశారు. అందులో 45 డాక్యుమెంట్లకు సంబంధించి రూ. 7.20 లక్షల పైచిలుకు నకిలీ చలానాలను సృష్టించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు గుర్తించారు. అందులో భాగంగా రూ. 92,500 నగదు రికవరీ చేశారు.
నకిలీ చలానాలను సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసిన విషయంపై ఉదయగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో పనిచేసే నలుగురు డాక్యుమెంట్ రైటర్లు, వారికి సహకరించిన డీటీపీ ఆపరేటర్ ఒకరిపై సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నకిలీ చలాన్ల వ్యవహారం బయటపడడంతో కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులతో పాటు స్టాంప్ వెండర్లు, డాక్యుమెంట్ రైటర్లలో ఆందోళన నెలకొంది. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: నకిలీ చలానాల వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు