Government Delay Sanctioning Funds for Road Repair Works: జాతీయ రహదారులను కలిపే గ్రామీణ రహదారులను నిర్మాణం చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. నిధుల కొరత పేరుతో నాలుగున్నర ఏళ్లుగా ప్రధాన రోడ్లు అసంపూర్తిగా వదిలివేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. కావలి నియోజకవర్గంలోని జలదంకి-తెల్లపాడు రోడ్డు పరిస్ధితి ఇది. కల్వర్టులు కూడా సరిగాలేక ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. 20గ్రామాల ప్రజలు ఈ రోడ్డు దుస్థితిని చూసి తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
Lack of Funds: నెల్లూరు జిల్లాలోని జలదంకి-తెల్లపాడులో ఏళ్లు గడుస్తున్నా రోడ్డు దుస్థితి మారటం లేదు. 26కిలోమీటర్లు, 20గ్రామాలకు దిక్కైన రోడ్డు ప్రస్తుతం నరకప్రాయంగా మారింది. రోడ్డు భవనాల శాఖ రోడ్డు ఇది. 26కిలోమీటర్లు విస్తరణకు సీఆర్ఎఫ్ నిధుల నుంచి మరమ్మతు చేయడానికి 20కోట్ల రూపాయలు అంచనా వేశారు. మే 2022న పనులు ప్రారంభించారు. దాసరి అగ్రహారం, తిమ్మసముద్రం గ్రామాల మధ్య కల్వర్టులు తొలగించారు. తాత్కాలికంగా వాహనాలు నడిచివిధంగా మట్టితో డైవర్షన్లు నిర్మించారు. నిధులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారు పనులు చేయకుండా వెళ్లిపోయాడు. దీంతో ప్రజల రాకపోకలకు కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో వర్షాలు పడటంతో మట్టి పనులు చేసిన చోట జారిపోతున్నాయి. భారీ వర్షాలు కురిస్తే కట్టలు కోతకు గురి అవుతాయి. వాగులు ప్రవహించి గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోతాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
"జలదంకి, గట్టుపల్లి క్రాస్ రోడ్డు, టంకంవారిపాలెం, గోపనపాలెం, అన్నవరం, తిమ్మసముద్రం, అన్నలూరు అనేక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతల రోడ్డు, మార్జిన్లు దెబ్బతిన్న రోడ్ల పై ప్రయాణం నరకంగా ఉంది. జలదంకి నుంచి కలిగిరి... కావలి వైపు వెళ్లే ప్రధాన రోడ్డు. నిత్యం వస్తువులు, పనుల కోసం ఈ మార్గం ద్వారా వెళ్తుంటాం. ప్రస్తుతం ఏర్పడిన రోడ్డు దుస్థితి వల్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తున్నాయి" - స్థానికుడు
గుత్తేదారు చేసిన పనులకు సంబంధించి ప్రభుత్వం 4కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంది. నిధుల కొరత కారణంగా ఆరు నెలలుగా పనులు నిలిచిపోయాయి. అరకొరగా చేసిన పనులతో ప్రజలు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు.
ప్రధానమైన ఈ రోడ్డు మార్గం నుంచి 20గ్రామాల ప్రజలు రాకపోకలు చేస్తుంటారు. గత ఏడాది కురిసిన వర్షాలకు 14చోట్ల డైవర్షన్ రోడ్డు తెగి పడ్డాయి. సుమారు పది రోజులు గ్రామాల్లోని ప్రజలు పట్టణాలకు రాకపోకలు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు మంజూరు చేసి రోడ్డు పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.