సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ కృష్ణపట్నం కాలువ ఆయకట్టుదారులు నెల్లూరులో ఆందోళన చేపట్టారు. నగరంలోని ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన రైతులు, కార్యాలయం గేటుకి తాళం వేసి నిరసనకు దిగారు. జలాశయాల్లో నీరున్నా, తమ పంటకు మాత్రం అధికారులు అందించట్లేదని వారు వాపోయారు. రైతులకు సర్ది చెప్పడానికి ప్రశ్నించిన అధికార పార్టీ నేతలతో రైతులు వాగ్వాదానికి దిగారు.
వరదలకు దెబ్బతిన్న నెల్లూరు ఆనకట్టకు మరమ్మతులు చేస్తుండటంతో సాగునీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. ఫలితంగా నారుదశలో ఉన్న పంటలు నీరు లేక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు, వరదలకు ఇప్పటికే రెండుసార్లు పంట నష్టపోయామని అన్నదాతలు వాపోయారు. తమ సమస్యను అధికారులకు మొరపెట్టుకున్నా వారు పట్టించుకోలేదని అన్నారు. సాయంత్రంలోగా నీరు విడుదల చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు .
ఇదీ చూడండి. 'భర్త ఉంటే భార్య ఉండకూడదు.. భార్య ఉంటే భర్త ఉండకూడదంట సార్..?'