Farmers Facing Water Problem : నెల్లూరు జిల్లాలో రైతులకు సోమశిల - కండలేరు జలాశయాలు ప్రధాన సాగునీటి వనరు. జలాశయంలో ప్రస్తుతం 51 టీఎంసీల నీరు ఉంది. పుష్కలంగా నీరు ఉండటంతో ఇటీవల జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో సాగునీటికి ఇబ్బందులు లేవని ప్రకటించారు. దీంతో రైతులు పాలకులు, జలవనరుల శాఖ అధికారుల మాటలు విని వేలాది ఎకరాల్లో రెండో పంటగా పత్తి, మిరప, కూరగాయలు పంటలు సాగు చేశారు. పంట చేతికి వచ్చే దశలో ఉంది. ముందస్తు హెచ్చరికలు లేకుండా కాలువలకు నీరు నిలుపుదల చేశారు. దీంతో పంటలు ఎండి పోతున్నాయి. 20 రోజులుగా రైతులు లబోదిబోమంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
బీటలు వారతోన్నపంట భూమి : జలవనరుల శాఖ అధికారులు ఆలోచన లేకుండా చేసిన పనికి, మండుతున్న ఎండలకు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. మరో వైపు గేట్లు మరమ్మతుల పేరుతో నీటిని ఆపేశారు. కాలువలు పూర్తిగా ఎండిపోయాయి. పంట వేసిన భూమి బీటలు వారుతుంది. పంటలు ఎండిపోతున్నాయని పాలకులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం.. పట్టించుకోని పాలకులు : సంగం బ్యారేజి నుంచి వచ్చే కనుపూరు, నెల్లూరు కాలువలకు 20 రోజులుగా నీరు నిలిపివేశారు. గ్రామీణ మండలం, వెంకటాచలం మండలాల్లో సాగు నీటి సమస్య ఉంది. గొల్లకందుకూరు సజ్జాపురం, కొత్తవెల్లంటి, పాతవెల్లంటి, ములుమూడి పలు గ్రామాల్లో రైతులు పంటను కాపాడుకునే మార్గంలేక వదిలివేశారు. కనుపూరు కాలువ కింద 400ఎకరాలు, నెల్లూరు కాలువ కింద 600ఎకరాల్లో వేసిన పత్తి, కూరగాయల పంటలు ఎండు ముఖం పట్టాయి. ఎకరాకి 40వేల రూపాయలు ఖర్చు చేశారు. అందరూ చిన్నకారు రైతులు కావడంతో తీవ్ర వత్తిడికి లోనయ్యారు. అధికారుల నిర్లక్ష్యం, పాలకులు పట్టించుకోకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు.
" రెండో పంట వేసుకోమని చెప్పేసరికి మొత్తం రెడీ చేసుకున్నాము. నీళ్ల కోసం 20 రోజుల నుంచి ఎదురుచూస్తున్నాం. కాలవ నీళ్లు నమ్ముకోని పత్తి పెట్టాము. నీళ్లు రాకపోయవడంతో పత్తి ఎండిపోతోంది. నీళ్లు రాకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంది. " - రైతులు
వేసవిలో మూగజీవాలకు ఈ నీరే ఆధారం : కాలువల్లో చుక్క నీరు లేదు. కాలువల్లో ఉన్న తూడు కూడా తొలగించలేదు. పూడికలు పేరుకుపోయి ఉన్నాయి. కాలువల పరిధిలో సుమారు 100 గ్రామాలకు పైగా ఉన్నాయి. ఈ గ్రామాల్లో పశువులకు వేసవిలో కాలువల్లో ఉన్న నీరే ఆధారం. మూగజీవాలకు తాగు నీరు కష్టంగా మారిందని రైతులు వాపోతున్నారు.
ఆలోచించి చెబుతాం : సాధారణంగా రెండు పంటల మధ్య ఖాళీ సమయంలో కాలువల మరమ్మతులు చేపడుతామని, అందుచేతనే నీటి విడుదలను నిలిపివేసినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా రైతులు అనధికారికంగా పంటలు వేయడంతోనే నీటి సమస్య ఉత్పన్నమైందని చెబుతున్నారు. పరిస్థితులను బట్టి నీటి విడుదలపై ఆలోచిస్తామని చెబుతున్నారు.
" కంటిన్యుగా వాటర్ ఇవ్వడం అంత సులభం కాదు. రైతులను కోరడం ఏమిటంటే పంట వేసేముందు వ్యవసాయాధికారును సంప్రదించాలని కోరుకుంటున్నాం. " - కృష్ణమోహన్, జలవనరుల శాఖ ఎస్ఈ, నెల్లూరు
నీటిని విడుదల చేసి పంటను కాపాడండి : జలాశయంలో పుష్కలంగా నీరు ఉందని, సాగునీటికి ఎటువంటి సమస్య లేదని ఒకవైపు అధికారులు చెబుతున్నప్పటికీ, కాలువలకు మాత్రం నీటిని విడుదల చేయడం లేదు. దీంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతామని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జలవనరులశాఖ తక్షణమే స్పందించి నీటిని విడుదల చేసి పంటను కాపాడాలని వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి