నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో రైతు చుండి శ్రీనివాసులు రెడ్డి (58) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతోనే బలవన్మరణాకి పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. రైతు శ్రీనివాసులు తన ఐదెకరాల పొలంతో పాటు మరి కొంత పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. సాగులో నష్టాలు రావటంతో అప్పులు పెరిగిపోయాయి. వాటిని తీర్చే దారి లేక మనస్తాపంతో పశువుల కొట్టంలో ఉరేసుకున్నాడు. భర్త కనిపించకపోవటంతో భార్య.. పశువుల కొట్టం వద్దకు వెళ్లి చూడగా శ్రీనివాస్ రెడ్డి ఉరేసుకుని తాడుకి వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సహాయంతో కిందకి దింపి చూడగా అప్పటికే ఆయన మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారిస్తున్నారు.
ఇవీ చదవండి: ప్రాథమిక పాఠశాలలో పెచ్చులూడిన పైకప్పు.. విద్యార్థికి గాయాలు