నెల్లూరు జిల్లాలో నవంబర్ 2 నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ చక్రధర బాబు తెలిపారు. నెల్లూరు నగరంలోని ఈఎస్ఆర్ఎం పాఠశాలలో జగనన్న విద్యా కానుక పథకాన్ని మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.
పిల్లల్ని పంపాలి..
కరోనా భయాందోళనలు వదిలి, తగిన జాగ్రత్తలు పాటిస్తూ పిల్లలను పాఠశాలకు పంపాలని తల్లిదండ్రులను కలెక్టర్ కోరారు. పాఠశాలలకు వెళ్లకుండా ఉంటే విద్యా సంవత్సరం వృథా అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో ఇంకా అక్షరాస్యత శాతం 67 శాతమే ఉండటం బాధాకరమన్నారు.
వందశాతం అక్షరాస్యతకు..
వయోజన విద్య ద్వారా నూరు శాతం అక్షరాస్యత సాధించేందుకు అందరూ కృషి చేయాలని కలెక్టర్ కోరారు. అమ్మ ఒడి, నాడు - నేడు, విద్యా కానుక లాంటి అనేక పథకాలు సర్కార్ ప్రవేశ పెడుతుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఘనంగా పెరుగుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు.