నెల్లూరు జిల్లాలోని పలుచోట్ల మిరప పంట చేతికి వచ్చే సమయం.. మరికొన్ని ప్రాంతాల్లో వేరుశెనగ, మామిడి, నిమ్మ, నువ్వు, వరి పంట కోతల సమయం. మెట్ట ప్రాంతాల్లో పత్తి పంటను సాగు చేశారు. ఇందులో సాధారణ రైతులతోపాటు, కౌలు రైతులు కూడా ఉన్నారు. పంటలు సాగు చేసేందుకు రైతులు పడిన కష్టాలు వర్ణనాతీతం. పంటలు సాగు చేసేందుకు రైతుల వద్ద సరిపడా పెట్టుబడి లేదు. ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేశారు. మరికొందరు ఇంట్లోని నగ నట్రా తాకట్టు పెట్టి.. పంటలను సాగు చేశారు. తీరా పంట చేతికందే సమయంలో అకాల వర్షం కురిసిన కారణంగా తీవ్రంగా నష్టపోయారు.
సూళ్లూరుపేటలో గురువారం కురిసిన అకాల వర్షానికి మిరప రైతులు నిండా మునిగిపోయారు. మండలంలోని ఉగ్గువడిలో 130 ఎకరాలు, మతకావడిలో 70 ఎకరాలు, మంగళంపాడులో 45 ఎకరాలు, రామచంద్రగుంటలో 20 ఎకరాల్లో మిరపపంట దెబ్బతింది. ఈ మేరకు రూ.20 లక్షల నష్టం వాటిల్లింది.
బంగారం తాకట్టు పెట్టి ..
కావలి మండల పరిధిలోని అన్నగారిపాలెం గ్రామానికి చెందిన పి. శ్రీనివాసులు వ్యవసాయ ఆధారంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. బ్యాంకులోను, ఉన్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి తెచ్చుకున్న రూ.2.50 లక్షల పెట్టుబడితో ఈ ఏడాది ఎనిమిది ఎకరాల్లో వేరుశనగ, రూ. లక్షతో వ΄డు ఎకరాల్లో వరి సాగు చేశాడు. జనవరి నెలలో వేసిన వేరుశనగ , వరి కోత కోసి ఆరబెట్టుకుంటున్న సమయంలో గురువారం నాటి అకాల వర్షానికి నీట మునిగిపోయి సుమారు రూ. రెండు లక్షల నష్టం వాటిల్లింది. నాలుగైదు ఏళ్లుగా వర్షాభావం నెలకొన్నా ఈ ఏడాది వర్షాలు పడి పంటలు బాగా పండుతాయన్నా ఆనంద]ంతో అప్పు పంటలు చేశాడు. తీరా నోటికాడకి వచ్చే సరికి వర్షంతో కన్నీళ్లు పెట్టుకోవడమే తప్ప తెచ్చిన అప్పులు కట్టే పరిస్థితి లేదు.
కౌలు కట్టేదెలా
దగదర్తి మండల పరిధిలోని సిద్దారెడ్డిపాలెం గ్రామానికి చెందిన కోటా భాస్కర్‌రెడ్డి రంగసముద్రం గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొన్నారు. ఇంట్లో ఉన్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టుపెట్టి రూ.1.80 లక్షల పెట్టుబడితో గత నెలాఖరులో పత్తి పంటను 10 ఎకరాల్లో వేశారు. వేసిన 10 రోజులకు అకాల వర్షం రావడంతో చేలో నీరు నిలిచి మొలక దెబ్బతిన్నది. పంటవేసినా వేయకపోయినా ఎకరా రూ. 5 వేల చొప్పున మొత్తం రూ.50 వేలు కౌలు రూపంలో చెల్లించాల్సి ఉంది. ఈ నష్టంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని, అధికారులు స్పందించి పరిహారం ఇవ్వాలని రైతు వేడుకుంటున్నారు.
నిమ్మ ..కన్నీటి చెమ్మ
గూడూరు మండలం నెర్నూరు గ్రామానికి చెందిన మోహన్ రెండు ఎకరాల్లో నిమ్మసాగు చేశారు. పెట్టుబడుల కింద ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి వడ్డీకి రూ.60వేలు తెచ్చారు. సొంతంగానే వ్యవసాయ పనులు చేస్తున్నారు. తోటను తగిన రీతిలో పెంచారు. పంట కూడా ఆశాజనకంగానే ఉంది. అయితే గురువారం కురిసిన అకాల వర్షం, గాలులకు చెట్లు దెబ్బతినడం, కాయలు రాలిపోవడంతో సుమారు రూ.20వేలకు పైనే నష్టపోయారు. తెచ్చిన అప్పు ఎలా తీర్చాలన్నది ఆవేదనగా ఉంది. గడిచిన నాలుగేళ్లు కరువుతో అల్లాడిపోయారు. ప్రస్తుతం మార్కెట్ లేకపోవడంతో నిమ్మకాయలను ఎక్కడికి తరలించాలన్నది రైతు ఆందోళన.
ఆరుగాలపు శ్రమ వృథా
గూడూరు మండలం మంగళపూరు గ్రామానికి చెందిన రమణయ్య నువ్వుపంట రెండు ఎకరాల్లో (కౌలుకు) సాగు చేశారు. నువ్వు పంటకి బ్యాంకులు, ఇతర ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.20వేలు అప్పు చేసి సాగు చేపట్టారు.ఈ ఏడాది సమృద్ధిగా నీరు ఉండడంతో పంట ఏపుగా పెరిగింది. ప్రస్తుతం కురిసిన వర్షానికి నువ్వు పంట పూర్తిగా దెబ్బతింది. కోసి కుప్పలు వేయడం, వాలి పోవడంతో గింజ మొలకెత్తే పరిస్థితి నెలకొంది. ఆరుకాలం కుటుంబమంతా శ్రమ పడి పెంచిన పంట దెబ్బతినడంతో ఆర్థికంగా నష్టపోయారు. దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించాలి.
ఈ బాధ తీరేదెట్టా
ఆత్మకూరు అప్పారావుపాళెం రైతు పి.ప్రభాకర్ నాయుడు ఈ ఏడాది పది ఎకరాల్లో మామిడి సాగు చేశారు. ఎరువులు, పురుగు మందులు, సేద్యం, నిర్వహణకు గాను రూ. 1.5 లక్షలు అప్పు అయ్యింది. ఈ ఏడాది కాపు సరిగాలేదు. అరకొరగా కాపు పట్టింది. కష్టాలు కొంతయినా తీరుతాయని భావించారు. అనుకున్నది ఒకటయితే జరిగింది మరొకటిలా తయారయ్యింది. అకాల వర్షం, ఈదురు గాలులకు ఉన్న కొద్దికాపు రాలిపోయింది. చెట్లకు ఏమీలేదు. సాధారణ కాపునకు అయితే ఏడాదికి రూ. 6 లక్షల వరకు రాబడి వస్తుంది. అయితే గత ఏడాది కూడా కాపులేక నష్టాలే మిగిలాయి. ఈ ఏడాది అకాల వర్షం నష్టం మిగిల్చింది.
చేతికొచ్చే దశలో నష్టం
రైతు పేరు శ్రీనివాసులు. వెంకటగిరి మండలం సోమసానిగుంట ఇతనిది.ఈయన ఈ ఏడాది రెండు ఎకరాల్లో వరి సాగుచేశారు.అకాలవర్షంతో 60సెంట్లలో పంట నష్టం వాటిల్లింది.సుమారు రూ.60వేలు ఎరువులు, పురుగుమందులకు అప్పు చేశారు. చేతికొచ్చే దశలో వర్షం కురవడం వల్ల పంట నేలవాలింది. చాలా వరకు గింజ రాలింది. శుక్రవారం మిషన్ ద్వారా కోత చేపట్టినా నేల వాలిన పంట చేతికి రాలేదు. దీంతో తానే స్వయంగా కోసి నూర్పిడి చేపట్టారు. ఇప్పటికే మిల్లర్లు ధాన్యం వద్దని చెప్పడంతో పొలాల వద్దే రాశుల నిల్వలు పెరిగిపోయాయి. రైతులకు ఇదీ పెనుభారమే.
అప్పుగా ఎరువులు, పురుగు మందులు
రైతు పేరు శివారెడ్డి. ఈయనది సిద్దాగుంట, బాలాయపల్లి మండలం. ప్రస్తుతం ఇతని పరిస్థితి దారుణంగా ఉంది. ఏడు ఎకరాల్లో వరి సాగుచేయగా రెండు ఎకరాల్లో పంట దెబ్బతింది.మొత్తం రూ.లక్షన్నర ఖర్చు అయ్యింది. దాదాపు రూ. లక్ష అప్పు తీసుకుని పెట్టుబడి పెట్టారు. ఎరువుల దుకాణదారుల వద్ద ఎరువులు, పురుగు మందులకు వడ్డీపై అప్పు చేస్తారు. పంట వచ్చిన తరువాత తీరుస్తారు. అకాల వర్షం కురవడంతో గింజ నేల రాలి రూ. 60వేల నష్టం వాటిల్లింది. కోత కోసిన పంట కూడా తడిచి ఆర్థికంగా ఎంతో నష్టపోయాడు.
మూడు సంవత్సరాలుగా పంట లేదు
రైతు రమణారావు. ఇతనిది వెంకటగిరి మండలం అరవపాళెం. ఈ ఏడాది ఎకరంన్నరలో వరి రూ. 50వేలు అధిక వడ్డీలకు అప్పుచేసి సాగుచేయగా 75సెంట్ల విస్తీర్ణంలో పంట దెబ్బతింది. గత వ΄డు సంవత్సరాలుగా వర్షాలు లేక పంట సాగు చేపట్టలేదు. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో చెరువులో నీరు చేరింది. పంట సాగు చేపట్టారు. కనీసం ఇంటి అవసరాలకు కొంత ధాన్యం ఉంచుకుని మిగతా పంట విక్రయించి అప్పులు భారం తగ్గించుకోవాలని ఆశ పడ్డారు. తీరా అకాల వర్షం పంట నేలా వాలింది. పది రోజుల తరువాత పంట కోత చేపట్టాల్సి ఉంది. ఈ తరుణంలో చాలా నష్టపోయారు.
ఇదీ చదవండి: