ఒకప్పుడు నెల్లూరులో ఉన్నన్ని సినిమా థియేటర్లు మరే జిల్లాలోనూ లేవు. వాటి నిర్వహణ చక్కగా ఉండేది. అర్చనగా మారిన రంగమహల్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. 1983లో ప్రారంభమైన నర్తకి థియేటర్‌లో మరెన్నో సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హాళ్లు.. షాపింగ్ కాంప్లెక్సులుగా మారబోతున్నాయన్నది చేదు వాస్తవం.
అసలే సాంకేతిక యుగం..! అరచేతిలో రివ్యూలు, మధ్యాహ్నానికే పైరసీ ప్రింట్. స్మార్ట్‌ఫోన్‌ల హవా పెరిగినప్పటి నుంచి ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలంటే కష్టమైపోయింది. కిందా మీదా పడి హాళ్లను నడిపిస్తున్న వేళ.. కరోనా విజృంభణ మొదలైంది. మొదటి దశ వ్యాప్తి పూర్తయ్యాక థియేటర్లు ప్రారంభించిన నిర్వాహకుల్లో మళ్లీ ఆశ చిగురించింది. కొన్ని నెలలకే రెండో దశ విజృంభిస్తుండటంతో.. మళ్లీ ప్రేక్షకుల రాక పూర్తిగా తగ్గింది. అంతంతమాత్ర ఆక్యుపెన్సీతో నిర్వహణ భారమవుతోందని నెల్లూరులో పలుచోట్ల కొన్ని షోలు వేయడమే మానేశారు. విద్యుత్, నిర్వహణ ఖర్చులూ రావట్లేదని వాపోతున్నారు.
నెల్లూరులో ఇప్పటికే సగం హాళ్లు మూతపడ్డాయని.. ప్రభుత్వం సరైన చర్యలతో ఆదుకోకుంటే పూర్తిగా కనుమరుగవుతాయని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచదవండి: స్విమ్స్‌లో బెడ్ల కొరత.. ఆరు బయటే రోగులకు ఊపిరులూదుతున్న వైద్యులు