నెల్లూరు జిల్లాలో ఇందుకూరుపేట , కోవూరు, కావలి ప్రాంతాలలో అధిక విస్తీర్ణంలో కొబ్బరి సాగు చేస్తుంటారు. వీరికి జీవనాధారం కొబ్బరి సాగే... కరోనా వైరస్ ప్రభావంతో కొబ్బరికాయల వ్యాపారులు కొనుగోలు చేయడానికి రావడంలేదని .. తీవ్రంగా నష్టపోతున్నామని కొబ్బరి రైతులు చెబుతున్నారు. కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు వచ్చినా కొబ్బరి కాయ నాలుగు నుంచి ఐదు రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని.. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు దిగాలు చెందుతున్నారు.
కొబ్బరి రైతులకు ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని రైతులు చెబుతున్నారు. కరోనా ప్రభావంతో కనీసం కొబ్బరికాయలు కోసేందుకూ కూలీల రావడంలేదని రైతులు చెబుతున్నారు. కాయలు కోసేందుకు వచ్చినా అధికంగా కూలీ డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతు ఏమి చేయలేక కాయలను తోటలోనే వదిలేస్తున్నారు. గతంలో కొబ్బరికాయ తొమ్మిది, పది రూపాయలు వ్యాపారులు కొనుగోలు చేసేవారు... వైరస్ ప్రభావంతో నాలుగు రూపాయలకు కొనుగోలు చేయడంతో తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
కరోనా ప్రభావంతో తీవ్రంగా నష్ట పోతున్నా ఉద్యాన శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం కొకోనట్ బోర్డు ద్వారా వచ్చే సహాయమూ అందడం లేదని రైతు నాయకులు అంటున్నారు.
ఇదీ చదవండి: రాజ్యసభ: న్యాయవ్యవస్థపై విజయసాయి వ్యాఖ్యల తొలగింపు