వారాంతాపు సెలవుల్లో నగర ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు నగర వనం ఎంతగానో దోహదపడుతుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అన్నారు. ఈ నరగ వనాన్ని జనవరి నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కొత్తూరు సమీపంలోని నిర్మాణంలో ఉన్న వనాన్ని అటవీశాఖ అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించారు.
నగర వనంలోని వాకింగ్ ట్రాక్, యోగా సెంటర్, పిల్లల ఆటస్థలం, క్యాంటీన్, పార్కులో నాటిన మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో 30 శాతం వరకు అడవులున్నాయని, వివిధ ప్రాంతాల్లో ఉన్న వన్యప్రాణుల పార్కులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. నగర వనాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ షణ్ముఖ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.