Nellore Corporation Budget Meeting: నెల్లూరు కార్పొరేషన్లో బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ బడ్జెట్ ప్రతిని చదవడం ప్రారంభించగానే కార్పొరేటర్లు లేచి సమస్యలపై మాట్లాడటంతో గందరగోళం నెలకొంది. 54 మంది సభ్యులం వైఎస్సార్సీపీ నుంచి ఎన్నికైన వారమే.. అంటూ మేయర్ ప్రసంగం వినకుండా పట్టణ ప్రణాళిక విభాగం అక్రమాలపై చర్చ లేవనెత్తారు. మరికొందరు సభ్యులు లేచినిలబడి సర్వసభ్య సమావేశం తేదీని తక్షణమే ప్రకటించాలని నినాదాలు చేశారు. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత... తేదీని ప్రకటిస్తానని మేయర్ స్రవంతి చెప్పినా సభ్యుల గొడవతో సమావేశం దద్దరిల్లింది.
నెల్లూరు కార్పోరేషన్లో 54 డివిజన్లను ప్రజలు వైఎస్సార్సీపీకు కట్టబెట్టారు. ఎప్పుడు సమావేశం నిర్వహించినా.. చర్చ కంటే కార్పొరేటర్ల విమర్శలతోనే ఎక్కువగా కొనసాగుతుంది. ఈ రోజు జరిగిన బడ్జెట్ సమావేశంలోనూ మూడు గంటలు గందరగోళం నెలకొంది. మనస్తాపానికి గురైన మేయర్ స్రవంతి తన ఛాంబర్లోకి రెండు సార్లు వెళ్లిపోయారు. కార్పొరేటర్లు సర్వసభ్య సమావేశం తేదీని ప్రకటించాలని పట్టుపట్టారు. ఎస్టీ మహిళనని అవమానపరుస్తున్నారని మేయర్ ఆవేదన వ్యక్తం చేశారు. మేయర్ అని కనీస గౌరవం కూడా లేదా అని గట్టిగా మాట్లాడారు.
వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన మేయర్ ఇటీవల పరిణామాల్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గంలో చేరారు. ఆమె బయటకు వచ్చిన తరువాత జరిగిన తొలి కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం ఇది. మేయర్ తన స్ధానంలో కూర్చున్నప్పటి నుంచి కార్పొరేటర్లు నిరసన ధ్వనులు వినిపిస్తూనే ఉన్నారు. సభను సజావుగా సాగించాలని మేయర్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. ప్రజాసమస్యలపై అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించాలని పలువురు కార్పొరేటర్లు మేయర్ స్రవంతిని డిమాండ్ చేశారు. ఈ నెల 26న నిర్వహిస్తామని మేయర్ చెప్పారు. ఇంకా ముందుగా నిర్వహించాలని గొడవకు దిగారు. ఎవరూ కూర్చోకుండా నిలబడ్డారు.
ఎప్పుడూ లేని విధంగా ఈ సారి.. 54 డివిజన్లు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నప్పుడు గొడవచేయని కార్పొరేటర్లు.. మేయర్ స్రవంతి మాట్లాడుతుంటే అరుపులు, కేకలతో సమావేశంలో గందరగోళం సృష్టించారు. నెల్లూరు నగరంలో అడ్డగోలుగా ఆక్రమణలు జరగుతున్నాయని, మినీబైపాస్లో ఒక హోటల్ ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేశారని, కమిటీ వేయాలని కార్పొరేటర్లు మల్లికార్జున యాదవ్, విజయ భాస్కర్ రెడ్డి, గౌరి డిమాండ్ చేశారు.
మేయర్ స్రవంతితో పలువురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగారు. దీంతో తనను అవమానిస్తున్నారని మేయర్ అన్నారు. సభ జరగనివ్వకుండా కావాలనే తనను అడ్డుకుంటున్నారని మేయర్ ఆవేదనతో బయటకు రావడం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి: