నెల్లూరు జిల్లా ఎస్సీ రైతు జైపాల్.. దళారులపై చర్యలు తీసుకోవాలని కోరితే ప్రభుత్వం ఆయన్ను వేధించటాన్ని ఖండిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ధాన్యం కొనడంలో విఫలమవడం రాష్ట్ర ప్రభుత్వ మొదటి తప్పిదమైతే... ఆ ధాన్యాన్ని దళారులు కొని, వాళ్లే జైపాల్ ఆధార్, పాస్‌బుక్, బ్యాంకు ఖాతాలతో సొమ్ము చేసుకుంటుంటే చోద్యం చూడటం మరో తప్పిదమని మండిపడ్డారు.
దళారులు చేసిన అక్రమాలు కప్పిపుచ్చడానికి జైపాల్‌ను వేధించడం దుర్మార్గమని చంద్రబాబు ధ్వజమెత్తారు. జైపాల్‌కు ఉన్నది 3 ఎకరాలైతే, 18 ఎకరాలు లీజుకు తీసుకుని 50 పుట్ల ధాన్యం అమ్మినట్లుగా పౌరసరఫరాల వెబ్‌సైట్‌లో ఎలా నమోదైందని చంద్రబాబు ప్రశ్నించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని నిజాయతీగా కోరిన ఎస్సీ రైతుకు ఇచ్చే బహుమానం వేధింపులా అని నిలదీశారు. రైతును చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లి జీపులో పడేసే అధికారం ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను క్షోభకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... 'జగన్.. సామాజిక న్యాయం సంరక్షకుడిగా మారారు'