నూతన వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు.. వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టిన భారత్ బంద్ నెల్లూరులో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు సర్వీసులు నిలిచిపోగా, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట సీఐటీయూ నేతలు రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆత్మకూరులో
జిల్లాలోని ఆత్మకూరులో ఆర్టీసీ డిపోలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇది మినహా ఆత్మకూరు పట్టణంలో మరెక్కడ బంద్ వాతావరణం కనిపించలేదు. వ్యాపారస్తులు అందరూ తమ దుకాణాలను తెరచి యదావిధిగా లావాదేవీలు నిర్వహించారు.
నాయుడుపేటలో
జిల్లాలోని నాయుడుపేటలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమవ్వటంతో.. ప్రయాణికులు అవస్థలు పడ్డారు. నెల్లూరు, చెన్నై, నాయుడుపేట నుంచి బెంగళూరు వెళ్లే రహదారులు ఖాళీగా కనిపించాయి.
ఉదయగిరిలో
ఉదయగిరిలో రైతు సంఘం, సీపీఎం, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలతో పాటు వామపక్షాల ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. బంద్ కారణంగా దుకాణాలు, పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోకు పరిమితమయ్యాయి. రైతు సంఘం, సీపీఎం నాయకులు పంచాయతీ బస్టాండ్ కూడలిలో.. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. పెంచిన గ్యాస్, డిజిల్, పెట్రోల్ ధరలుతో పాటు నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ప్రజావ్యతిరేక విధానాలను మానుకోవాలన్నారు.
ఇదీ చదవండి: