పట్టాదారు పాసు పుస్తకం కలిగి ఉండి పంట రుణం కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు పదిహేను రోజుల్లోపు బ్యాంకు నుంచి పంట రుణం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని స్త్రీ శక్తి భవనంలో ఉదయగిరి ప్రాంతంలోని పలు మండలాల బ్యాంకు మేనేజర్లు, వైయస్సార్ కాంతి పథం ఏపీఎంలు, సీసీలతో సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాల ద్వారా మంజూరు చేస్తున్న రుణాల లక్ష్యాలపై మండలాల వారీగా సమీక్షించి వివరాలు సేకరించారు.
నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం మంజూరు చేసే రుణాలను బ్యాంకర్లు ఆంక్షలు విధించకుండా లబ్ధిదారులకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రుణ లక్ష్యాలను అధిగమించాలన్నారు. జగనన్నతోడు కార్యక్రమంలో భాగంగా అర్హత గల చిరు వ్యాపారులకు బ్యాంకర్లు రూ.10 వేలు బ్యాంకు రుణం అందించాలన్నారు. రుణం తీసుకున్న లబ్ధిదారులు సకాలంలో చెల్లిస్తే వచ్చే ఏడాది రెట్టింపు చేసి రుణం మంజూరు చేస్తారన్నారు. వైయస్సార్ చేయూత, ఆసరా పథకాలకు నగదును తీసుకునేందుకు మహిళలు బ్యాంకుల వద్దకు వచ్చేటప్పుడు సామాజిక దూరం పాటించాలన్నారు. గుంపులుగా బ్యాంకులకు రాకుండా కొద్దిమంది వచ్చి నగదు తీసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సమావేశంలో నాబార్డు డీడీ ఎం. రవిసింగ్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి. వైకాపా పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టిస్తోంది: ఎంపీ గల్లా జయదేవ్