నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మర్లపల్లికి చెందిన దువ్యూరు విజయలక్ష్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖలో ఉన్నతాధికారిణిగా విధులు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణానంతరం సొంతూరులోనే నివాసముంటున్నారు. తన అక్క కుమారుడు వెంకట కృష్ణారెడ్డి రెండు దఫాలు సర్పంచిగా పని చేశారు. ఈ సారి ఎన్నికల బరిలో దిగాలని భావించగా.. అయిదు రోజుల కిందట గుండెపోటుతో మృతి చెందారు. అతని కోరిక తీర్చడంతో పాటు గ్రామానికి మంచి చేయాలన్న ఉద్దేశంతో.. 82 ఏళ్ల వయసులో విజయలక్ష్మి సర్పంచి పదవికి ఆదివారం నామపత్రం దాఖలు చేశారు.
ఒక్కరోజు వయస్సు తక్కువని..
నాయుడుపేట మండలం తిమ్మాజీకండ్రిగ పంచాయతీ ఏడో వార్డుకు పదో తరగతి వరకు చదివిన స్థానిక హేమలత ఆదివారం నామినేషన్ వేసేందుకు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. సర్పంచి, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు 21 ఏళ్లు నిండాల్సి ఉంది. కానీ, ప్రక్రియలో భాగంగా పోలింగు రోజుకు హేమలత వయస్సు ఒక రోజు తక్కువగా ఉన్నట్లు తేలింది. దాంతో ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. స్థానికులు ఆమె తల్లితో నామినేషన్ వేయించారు.
ఇదీ చదవండి: విశాఖ ఉక్కు కర్మాగారం ఎదుట ఆందోళనలు ఉద్ధృతం