కొవిడ్-19 వైరస్ ప్రభావంతో విదేశాలకు మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు నిలిచి పోయిన కారణంగా... ఆక్వా రంగం గత కొన్ని నెలలుగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. స్థానికంగా అమ్మకాలు లేని పరిస్థితుల్లో చాలా మంది రైతులు పెట్టుబడులు సైతం తిరిగి రానంతగా నష్టపోయారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కొన్ని దేశాల్లో మెరుగు పడుతున్నాయి. ఫలితంగా.. గత నెల 31 నుంచి కృష్ణపట్నం ఓడరేవు ద్వారా చైనా యూఎస్, యూకే దేశాలకు 214 కంటైనర్లు 3,582 మెట్రిక్ టన్నుల రొయ్యలు ఎగుమతి అయినట్లు నెల్లూరు జిల్లా మత్స్య శాఖాధికారి తెలిపారు. రోజురోజుకూ ఎగుమతులు పెరుగుతున్నాయని ఆక్వా రైతులెవరూ అధైర్య పడవద్దని సూచించారు. రానున్న రోజుల్లో 100 కౌంట్ రొయ్యలకు మంచి ధర లభించే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో 14 రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆయా యూనిట్ల ద్వారా ప్రభుత్వం నిర్థేశించిన ధరలకే రొయ్యలను కొనుగోలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు దాదాపు 2,858 మెట్రిక్ టన్నుల రొయ్యలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. 30, 40 కౌంట్ల రొయ్యలకు ధర తక్కువ లభించిందని, మిగిలిన వాటికి మెరుగైన ధరలు లభించాయని మత్స్య శాఖాధికారులు చెప్పారు. కరోనా ప్రభావం కారణంగా రెడ్ జోన్ ఏరియాలో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: