amaravathi farmers padayatra: అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న మహాపాదయాత్ర 31వ రోజు ఎన్నో అడ్డంకుల మధ్య కొనసాగింది. నేడు నెల్లూరు జిల్లా మరుపూరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. 12 కిలోమీటర్ల మేర సాగి మరిపల్లి వద్ద ముగిసింది. జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించిన రైతులకు.. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్వాగతం పలికారు. పాదయాత్రలో భాజపా కిసాన్ మోర్చా నాయకులు సైతం పాల్గొన్నారు. పాదయాత్రలో సర్వమతాలకు సంబంధించిన వాహనాలకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకుంటున్నారంటూ నెల్లూరు జిల్లా పొదలకూరు రోడ్డు మరుపూరు వద్ద రోడ్డుపై రైతులు, మహిళలు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది.
ప్రచార రథాలను అడ్డుకోవటంపై రైతుల ఆగ్రహం
అమరావతి రాజధాని అందరిదని, ప్రచార రథాలను అడ్డుకోవడం సరికాదంటూ మహిళలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల నిరసనతో తిరుపతి నుంచి విజయవాడ వైపు వెళ్లే రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు గంటకు పైగా రైతుల ఆందోళన కొనసాగడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రచార రథాలకు న్యాయస్థానం అనుమతి లేదంటూ పోలీసులు వాదించగా.. మద్దతు తెలిపే వారిని అడ్డుకోవాలని కోర్టు చెప్పలేదంటూ పరస్పరం వాదించుకున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో రైతులు తమ ఆందోళనను విరమించారు.
రోడ్డుపైనే భోజనాలు
మధ్యాహ్నం పొదలకూరులో రైతులు భోజనం చేయాల్సి ఉండగా.. స్థానిక అధికార పార్టీ నాయకులు వారికి ఎక్కడా ఆగేందుకు అనుమతించలేదు. దీంతో రోడ్డుపైనే వాహనాలను నిలిపి భోజనాలు చేశారు.
మర్రిపల్లిలో రాత్రి బస చేసేందుకు ఆంక్షలు
మర్రిపల్లిలో రాత్రి బస చేసేందుకు ఆంక్షలు, అడ్డంకులు కొనసాగడంతో.. సుమారు 25కిలోమీటర్ల మేర రైతులు ఆటోల్లోనూ, బస్సుల్లోనే వెనక్కి వెళ్లి అంబాపురం రోడ్డు కొత్తూరు వద్దే బసచేశారు. రేపు తిరిగి ఆటోల్లోనూ, బస్సుల్లోనూ మర్రిపల్లి చేరుకోనున్న రైతులు.. అక్కడ నుంచి 32వరోజు మహాపాదయాత్ర కొనసాగించనున్నారు.
ఇదీ చదవండి: Fire accident: మోహన్ స్పిన్ టెక్ కర్మాగారంలో అగ్నిప్రమాదం