నెల్లూరులో పోస్టుమార్టం చేసేందుకు లంచం అడిగిన డాక్టర్ సంధాని బాషాను విధుల నుండి తొలగిస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని ఉదయగిరి సీహెచ్ సీలో పని చేస్తున్న డాక్టర్ బాషా.. శవానికి పోస్టుమార్టం చేసేందుకు డబ్బులు డిమాండ్ చేయడం సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనపై తక్షణం చర్యలు తీసుకోవాలని మంత్రి విడదల రజిని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి నెల్లూరు డీసీహెచ్ఎస్ ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేసి, వివరాలను ప్రభుత్వానికి అందజేశారని మంత్రి తెలిపారు. నివేదిక ఆధారంగా డాక్టర్ బాషాను తక్షణమే విధుల నుండి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వెల్లడించారు. అంతేకాకుండా.. తదుపరి విచారణ పూర్తి అయ్యేంత వరకూ హెడ్ క్వార్టర్ ను వదిలి వెళ్లొద్దని బాషాను ఆదేశించినట్టు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఏం జరిగిందంటే?
ఆర్థిక ఇబ్బందులతో పూట గడవడం కష్టంగా మారడంతో.. తీవ్ర ఆవేదనకు గురైన ఓ కూలి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్తను కోల్పోయి పట్టెడు దుఖంలో ఉన్న అతని భార్యకు.. డాక్టర్ రూపంలో మరో కష్టం ఎదురైంది. మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. శవపంచనామాకు లంచం అడిగాడు అక్కడి వైద్యుడు బాషా. చేతిలో చిల్లి గవ్వలేదని ఆమె వాపోయింది. ఎలాగైన తమ భర్తకు శవపంచనామా నిర్వహించమని కాళ్లావేళ్లాపడి ప్రాధేయపడింది. అయినా.. కనికరించలేదు ఆ వైద్యుడు. పోస్టుమార్టం చేయాలంటే రూ.15వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. డబ్బులు ఫోన్ పే చేయాలని చెప్పి, ఫోన్ నెంబర్ ఇచ్చి వైద్య వృత్తికే కలంకం తెచ్చాడు. అన్ని విధాలుగా ప్రాధేయపడిన ఆభాగ్యురాలు.. చివరకు వైద్యుడు సందాని భాషాపై ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన అధికారులు.. చర్యలు చేపట్టారు.