పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ గ్రామాలు తరతరాలుగా తాగునీటి సమస్యతో సతమతమవుతూనే ఉన్నాయి. గుమ్మలక్ష్మీపురం మండలంలోని వాడపుట్టి, జోగిపురం, చినరావికోన, వల్లాడ, ఎగువచోడిపల్లి, గణపాక గిరిజనులకు నేలబావులే ఆధారం. పాచిపెంట మండలంలోని బొర్రమామిడి, తంగలాం, కర్రివలస గ్రామాలకు ఊటనీరే దిక్కు. బిందెడు నీటి కోసం గిరిజన మహిళలు చంకలో పిల్లలతో కొండలు, గుట్టలు, కారడవిలో గంటల తరబడి కిలోమీటర్ల మేర నడక సాగించాల్సిన దుస్థితి.
కర్రివలస పంచాయతీ మూలవలస గిరిజన గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారణకు ట్యాంకు నిర్మాణం చేపట్టారు. అయితే పైపులైన్లు, మోటార్ ఏర్పాటులో ఆలసత్వం వల్ల ఇక్కడ నివసించే వందలాది కుటుంబాలు నీటి చెలమల నుంచే తాగునీటిని సేకరిస్తున్నాయి. గంటల తరబడి పడిగాపులు కాస్తేనే ఊటనీరు దొరుకుతోంది. ఎండలు ముదిరితే...ఈ నీరు కూడా లభించదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాచిపెంట పైలెట్ ప్రాజెక్ట్ ద్వారా ఇటుకలవలస గ్రామానికి వారానికి రెండుసార్లు నీటిని సరఫరా చేస్తున్నారు. కలుషితమైన ఈ నీరు తాగితే ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఊటనీటిపైనే ఆధారపడుతున్నామంటున్నారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యకు చర్యలు చేపడుతున్నామని పాలకులు, అధికారులు చెబుతున్నా..ఆచరణలో అడుగు ముందుకు పడటం లేదని స్థానికులు చెబుతున్నారు. ఎండల తీవ్రత పెరిగేలోపు తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: కాకినాడ నగర శివారు వాసులకు ... తాగునీటి కష్టాలు