Kejriwal and Bhagwant Mann Speech at Khammam Sabha: కేంద్రం ప్రభుత్వంపై ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభలో ఆప్ అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. మరో ఆప్ పాలిత రాష్ట్రమైన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తనదైన శైలిలో కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు. పలువురు జాతీయ నాయకులు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
గవర్నర్లను మోదీ ఆడిస్తున్నారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్ తన ప్రారంభనోపన్యాసంతోనే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పెద్దన్నగా సంబోధించి స్పీచ్ మొదలెట్టారు. ఇవాళ తాను రెండు గొప్ప కార్యక్రమాల్లో పాల్గొన్నానన్నారు. కంటి వెలుగు అద్భుత కార్యక్రమమన్న ఆయన.. కంటి వైద్య పరీక్షలు ఉచితంగా అందించడం గొప్ప విషయమని కొనియాడారు. కంటి వెలుగు కార్యక్రమం దిల్లీలోనూ అమలు చేస్తామన్నారు. తాము ఒకరి నుంచి మరొకరం నేర్చుకుంటామని కేజ్రీవాల్ అన్నారు. దిల్లీ మొహల్లా క్లినిక్‌లను సీఎం కేసీఆర్ తెలంగాణలో బస్తీ దవాఖానాగా అమలు చేశారన్న దిల్లీ సీఎం... మొహల్లా క్లినిక్‌ల పరిశీలనకు కేసీఆర్ దిల్లీ గల్లీలో తిరిగారని గుర్తు చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ దిల్లీ పాఠశాలలు పరిశీలించి.. అక్కడ పాఠశాలలు బాగుచేసుకున్నారని కేజ్రీవాల్ వెల్లడించారు.
'దిల్లీలో ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు కూడా ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా దేశం వెనుకబడే ఉంది. మన తర్వాత స్వాతంత్య్రం పొందిన సింగపూర్ దూసుకెళ్తోంది. కేరళలో విద్య, వైద్యం బాగుంటుందని చిన్నప్పటి నుంచి విన్నా. మరి మిగతా రాష్ట్రాల్లో ఎందుకు బాగాలేదు. గవర్నర్లు సీఎంలను ఇబ్బందులు పెడుతున్నారు. గవర్నర్లను మోదీ ఆడిస్తున్నారు. గవర్నర్లకు దిల్లీ నుంచి ఒత్తిడి ఉంది. సీఎంలను ఇబ్బందులు పెట్టడంలో ప్రధాని బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికలు దేశాన్ని మార్చేందుకు ప్రజలకు మంచి అవకాశం.'-కేజ్రీవాల్, దిల్లీ సీఎం
పంజాబ్‌లోనూ తెలంగాణ మాదిరి కార్యక్రమాలు చేపడతాం: మరో ఆప్ పాలిత రాష్ట్రమైన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. లూటీ చేయడం.. అమ్మడమే భాజపా సిద్ధాంతమని భగవంత్ మాన్ ఫైర్ అయ్యారు. కేంద్ర సంస్థలు ఎల్‌ఐసీ, రైల్వేశాఖ అమ్మకానికి బీజేపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. పంజాబ్‌లో ఆప్ చరిత్రాత్మక విజయం సాధించిందన్నారు. పంజాబ్‌లోనూ తెలంగాణ మాదిరి కార్యక్రమాలు చేపడతామన్న భగవంత్ మాన్.. మంచి కార్యక్రమాలు ఎక్కడినుంచైనా నేర్చుకోవచ్చన్నారు.
మార్పునకు తొలి అడుగుగా ఖమ్మం సభ: అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తోందని.. దేశంలోనే తెలంగాణ వెలుగులీనుతోందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రాష్ట్ర అభివృద్ధిపై ప్రశంసలు గుప్పించారు. రాష్ట్రంలో 'కంటి వెలుగు' వంటి మంచి పథకం చేపట్టారన్నారు. ఖమ్మం సభకు పెద్దఎత్తున ప్రజలు తరలిరావడం మార్పునకు తొలి అడుగుగా భగవంత్ మాన్ పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కొనుగోళ్లతో అధికారం దక్కించుకునే కుట్ర జరుగుతుందని ఆయన కేంద్రంపై మండిపడ్డారు.
'పంజాబ్‌లో అవినీతిని రూపుమాపాం. అవినీతికి పాల్పడిన నేతలను జైళ్లకు పంపాం. దేశం ఎటు వెళ్తుందోననే ఆందోళన నెలకొంది. కేంద్రం యువత, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. హామీలు నెరవేర్చకుండా భారతీయ జుమ్లా పార్టీగా మారింది. ఏటా 2 కోట్ల ఉపాధి కల్పిస్తామని మోసం చేశారు. యువతకు ఉపాధి కల్పిస్తామన్న హామీ నెరవేర్చలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోసం చేశారు. ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోసం చేశారు. దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లోనూ కుట్రలు చేశారు.'- భగవంత్ మాన్, పంజాబ్ సీఎం
బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నిర్వహించిన సభకు ఆ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సీఎం కేసీఆర్‌తో పాటు దిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తదితరులు హాజరుకావడంతో గులాబీ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగింది. ఏపీ, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఖమ్మం పట్టణం జనసంద్రంగా మారింది.
ఇవీ చదవండి: