Generators Village: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పోతవరానికి జనరేటర్ల గ్రామంగా పేరుంది. ఒక్కో ఇంటికి ఒక్కో జనరేటర్ ఉంటుంది. జనరేటర్ తయారీకి దిల్లీ, ముంబయి తదితర ప్రాంతాల నుంచి విడిభాగాలు తెచ్చుకునేవారు. ఒక్కో జనరేటర్ తయారీకి 2 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. కొన్ని దశాబ్దాలుగా జనరేటర్ల తయారీ, చిన్నచిన్న మెకానిక్ పనులు చేసుకుంటూ ఉపాధి పొందేవారు.
10కేవీ, 20 కేవీ నుంచి 125 కేవీ వరకు సామర్థ్యాన్ని బట్టి జనరేటర్లకు.. 8వేల నుంచి 25వేల రూపాయల వరకు ప్రతినెల అద్దె పొందేవారు. సముద్ర తీర ప్రాంతం వెంబడి రొయ్యలు, చేపల చెరువులకు వినియోగించే జనరేటర్లు ఇక్కడ తయారైనవే. కరోనా కాలం నుంచి ఆర్డర్లు లేక జనరేటర్ల వాడకం తగ్గింది. జీవనోపాధి లేక కుటుంబ పోషణ భారమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సవ్యంగా సాగుతున్న వీరి ఉపాధి మార్గాన్ని కరోనా దెబ్బతీసింది. రెండేళ్లుగా జనరేటర్ల వినియోగం తగ్గిపోయింది. లక్షల పెట్టుబడి పెట్టి తయారుచేసిన జనరేటర్లు ఇళ్ల ముందే ఉంటున్నాయి. ప్రతిరోజూ వాటిని శుభ్రం చేసుకోవడం పనిగా మారింది. అలా చేయకపోతే అవి పాడవుతాయి.
విదేశాలకు రొయ్యలు, చేపల ఎగుమతి పెరిగితేనే.. మళ్లీ పూర్వవైభవం వస్తుంది. మరోవైపు వీటికి మరమ్మతులు చేసే గ్యారేజీల నిర్వాహకులు సైతం ఉపాధి సమస్యను ఎదుర్కొంటున్నామని వాపోయారు. జనరేటర్ల వినియోగం తగ్గడంతో ఉపాధి కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకుని సాయం అందించాలని పోతవరం గ్రామస్థులు కోరుతున్నారు.
"పోతవరం గ్రామంలో సుమారు 2000 జనరేటర్లు ఉన్నాయి. గతంలో చేపలు, రొయ్యల చెరువులకు సప్లై చేసేవారు. ప్రస్తుతం సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నారు". - షేక్ కరీముల్లా, స్థానికుడు
"రెండు సంవత్సరాలుగా జనరేటర్లు తిరగడం లేదు. మాకు రెంటు లేదు. మెకానిక్‌కి పనిలేదు. పిల్లల చదువులకు ఇబ్బంది అవుతోంది". - షేక్ అబ్దుల్ బాషా, స్థానికుడు
"ఒక్కో జనరేటర్ రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయలు అవుతుంది. జనరేటర్లను ఆర్డర్ ఇచ్చేవారు లేరు. రెండు సంవత్సరాలుగా జనరేటర్లు తిరగక కుటుంబపరంగా ఇబ్బంది పడుతున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. వారిని చదివించుకోవడం కష్టంగా ఉంది". - మస్తాన్ వలీ, స్థానికుడు
ఇవీ చదవండి: