Vijayawada Indrakeeladri Dussehra Celebrations 2023 : మరో నాలుగు రోజుల్లో దసరా ఉత్సవాలు రానున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది అమ్మ వారి భక్తులు తరలివస్తారు. వారికి ఎటువంటి లోటు పాట్లు, అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం, ఇటు దుర్గగుడి అధికారులపై ఉంది. గత ప్రభుత్వ హయాంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన కృష్ణా నది ఘాట్ మెట్లు నేడు అధ్వానంగా తయారయ్యాయి. పద్మావతి ఘాట్, కృష్ణవేణి ఘాట్ మెట్లు ఎక్కడికక్కడ ధ్వంసమై ఉన్నాయి. గత ఏడాది ఈ మెట్లు ధ్వంసమై ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది భక్తులకు ఇక్కట్లు తెప్పేటట్లు లేదు.
Officials Neglect Kanakadurgamma Dussehra Celebrations : టీడీపీ హయాంలో కోట్లాది రూపాయలతో చేపట్టిన కృష్ణా నది ఘాట్ మెట్లు పనులు నిర్వహణ లేక చాలా చోట్ల ధ్వసమయ్యాయి. సంబంధిత అధికారులు పర్యవేక్షణ లోపించడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. రాత్రి అయితే చాలు మందుబాబులకు స్థావరంగా ఈ మెట్లు మారుతున్నాయి. ముఖ్యంగా కృష్ణవేణి ఘాట్‌కు ఎప్పుడు వెళ్లిన మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి.
ఎక్కడ చూసినా కాల్చి పడేసిన సిగరెట్లు, మద్యం సీసాలే కనిపిస్తున్నా, ఆర్టీసీ బస్టాండ్‌కు వెనుకాల ఉండే ఈ కృష్ణ వేణి ఘాట్‌లో చాలా మంది మద్యం సేవిస్తూ ఉంటారని, రోజురోజుకూ మందుబాబుల ఆగడాలు పెరుగుతున్నా పోలీసులు పట్టించుకోవటంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో ప్రైవేటు హోటల్స్ యజమానులు షాపులు నిర్వహిస్తున్నారని, దీంతో చెత్తా చెదారం ఈ ప్రాతంలో మెట్ల పైకి చేరుతుందని ఆరోపిస్తున్నారు. ఎంతో పవిత్ర స్థలంగా భావించే ఈ మెట్లపై ఇలాంటివి చూసి భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Vijayawada Kanakadurgamma Temple Dasara Celebrations October 15 to 23 : ఈ నెల 15 నుంచి 23 వరకు జరగనున్న దసరా నవరాత్రులకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది అమ్మ వారి భక్తులు విజయవాడకు తరలివస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు అధికారులు చేయాల్సి ఉన్నా.. పనులు పూర్తి అయినట్లు ఎక్కడా కనిపించటం లేదు.
చాలా చోట్ల ఘాట్ మెట్లు పాడైపోయి ఉండడంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందిపడే అవకాశం ఉంది. టైల్స్ ఊడిపోయి ఎక్కడికక్కడ రాళ్లు తేలి కనిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా ఈ మరమ్మతు పనులు పూర్తి చేయాల్సి ఉంది. లేకపోతే భక్తులు తీవ్ర ఇక్కట్లు పడే అవకాశం లేకపోలేదు. నదిలో నీరు తక్కువగా ఉండడంతో స్నానానికి పైపులు ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేశారు. భక్తులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి, వస్త్రాలు మార్చుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు ఈ చుట్టు పక్కలే చేయాల్సి ఉంది.
దసరా ఉత్సవాలకు సిద్ధమైన ఇంద్రకీలాద్రి.. నేడు స్వర్ణ కవచాలంకృత రూపం