TDP fire on Vinukonda issue: పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ శ్రేణులపై పోలీసుల లాఠీచార్జీని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. పోలీసులు వైసీపీ జేబు సంస్థలా పని చేస్తున్నారని అరోపించారు. ర్యాలీపైకి రాళ్లు రువ్విన వైసీపీ శ్రేణులను వదిలేసి.. తిరిగి టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. వైసీపీ చిల్లర వేషాలకు టీడీపీ కార్యకర్తలు భయపడరని చంద్రబాబు నాయుడు అన్నారు.
తెలుగుదేశం కార్యకర్తలు భయపడరు.. రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండి పడ్డారు. వినుకొండలో తమ పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులపై కార్యకర్తలు శాంతియుత నిరసనలు చేపడితే.. వైసీపీ నేతలు వారిని రెచ్చగొట్టడమే కాకుండా దాడులు చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే తీరు కారణంగా శాంతి భద్రతల సమస్య వస్తుంటే నివారించాల్సిన పోలీసులు.. తిరిగి తెలుగు దేశం కార్యకర్తలపైనే లాఠీచార్జ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. వినుకొండలో నేటి పరిస్థితులు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌కు నిదర్శనం అని చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ చిల్లర వేషాలకు టీడీపీ కార్యకర్తలు భయపడరని చంద్రబాబు నాయుడు అన్నారు. ఖాకీ దుస్తులు వేసుకున్న ఏ స్థాయి పోలీసు అధికారులైనా వాటి విలువ తగ్గకుండా పని చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. నియోజకవర్గంలో వైసీపీ నేతల రౌడీయిజంపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే దాడులు.. వినుకొండలో తమ కార్యకర్తలపై వైసీపీ దాడి అప్రజాస్వామికమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు. టీడీపీ లక్ష్యంగా వైసీపీ నాయకులు, శ్రేణులు నిత్యం దాడులకు పాల్పడుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రోద్బలంతోనే దాడికి తెగబడ్డారని ఆరోపించారు. ఈ దాడిలో 15 మంది టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న విషయాన్ని గమనించాలని హితవు పలికారు. దాడులకు పాల్పడిన వైసీపీ కార్యకర్తలను వదిలేసి టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేసేందుకే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారని ఆరోపించారు. శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి పరిస్థితిని నియంత్రణలోకి తీసుకురావాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.