TDP VARLA LETTER TO PALNADU COLLECTOR : మాచర్ల ఘటనపై పల్నాడు జిల్లా కలెక్టర్‌కు టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. డిసెంబర్ 16న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామిరెడ్డి నాయకత్వంలో మాచర్లలో అల్లకల్లోలం సృష్టించారని లేఖలో ప్రస్తావించారు. మాచర్ల ఘటన రాష్ట్ర చరిత్రలో బ్లాక్‌డేగా నిలిచిపోతుందన్నారు. ఐదు గంటలపాటు ప్రజలపై, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై, మహిళలపై భౌతిక దాడులకు పాల్పడి వారి ఇళ్లను తగులబెట్టారని మండిపడ్డారు. 2019లో దళితులు వైసీపీకు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు ఇదే గూండాలు దళితులపై దుర్మార్గంగా దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు ఆ కేసుల్లో ఎలాంటి పురోగతి లేదని ధ్వజమెత్తారు. మాచర్లలో అధికార పార్టీ నాయకుల ప్రైవేటు గూండాలు 16 మందిని హత్య చేసినా పోలీసులు హంతకులను అరెస్టు చేయడంలో పూర్తిగా విఫలం చెందారని ఆరోపించారు. మాచర్ల ప్రజలకు ప్రాథమిక హక్కులను పునరుద్ధరించే అన్ని ప్రయత్నాలను పోలీసులు తీవ్రంగా నిలిపివేస్తున్నారని ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌గా రాజ్యాంగ విధులను నిర్వర్తించాలని కోరుతున్నట్లు లేఖలో తెలిపారు. భౌతిక దాడులకు బాధ్యులైన గూండాలు, వారికి సహకరించిన పోలీసు అధికారులపై నిష్పాక్షిక విచారణ నిర్వహించి.. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆస్తులు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం అందేలా చూడాలని లేఖలో కోరారు.
ఇవీ చదవండి: