yuvagalam padayatra: వినుకొండ నియోజకవర్గంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆగస్టు 1న జరగనున్న సందర్భంగా... నూజెండ్ల మండలం ముప్పరాజువారిపాలెం వద్ద ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ నాయకులు, మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీదర్, ఉగ్ర నర్సింహారెడ్డి తదితర నాయకులు పాదయాత్ర ఏర్పాట్లను పరిశీలించారు.
ప్రభంజనంలా యువగళం పాదయాత్ర... నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో అవినీతి సామ్రాజ్యాలుగా ఏర్పడిన పల్నాడు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో లోకేశ్ బాబు యువగళం పాదయాత్ర జరగబోతుంది. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై లోకేశ్ చాలెంజ్ చేయబోతున్నారు.. దమ్ముంటే వైసీపీ అక్రమార్కులు చాలెంజ్ కి సిద్ధమేనా అని మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు సవాల్ విసిరారు. పల్నాడు జిల్లాలో జీవి ఆంజనేయులు నాయకత్వంలో జరిగే యువగళం ఒక చరిత్ర సృష్టించబోతుందన్నారు. ఇప్పటివరకు డిపార్ట్మెంట్ల వారీగా జరిగిన అవినీతి, అక్రమాలు, దోపిడీలపై లోకేశ్ బాబు ప్రశ్నిస్తూ, చాలెంజ్ విసరనున్నట్లు వెల్లడించారు. యువగళం పాదయాత్రకు ప్రజలు తండోపతండాలుగా హాజరవ్వడమే కాకుండా అనేక సమస్యలను ఆయన దృష్టికి తెస్తున్నారన్నారు. వైసీపీకి ఓటు వేస్తే తమ ఆస్తులు లాగేసుకున్నారని... ఎంతోమంది బాధితులు లోకేశ్ వద్దకు వచ్చి విన్నవించుకుంటున్నారని, ఆయా సమస్యలన్నీ అర్థం చేసుకొని పరిష్కార మార్గానికి హామీ ఇస్తూ యువగళం పాదయాత్ర ఒక ప్రభంజనంలా సాగుతుందన్నారు.
గంజాయి హబ్‌లా మారిన రాష్ట్రం... యువ గళం పాదయాత్రతో వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతుందని నక్కా ఆనంద్ బాబు అన్నారు. యువ గళం పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు చిత్తూరు జిల్లాలో అనేక అడ్డంకులను సృష్టించినప్పటికీ, రెట్టింపు ఉత్సాహంతో లోకేష్ బాబు ప్రజల పట్ల అంకితభావం, చిత్తశుద్ధితో సమస్యల పరిష్కారానికై యువగళం పాదయాత్ర సాగిస్తున్నారన్నారు. 12 కేసుల్లో 16 నెలలు జైలుజీవితం గడిపిన జైలు పక్షి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు, ప్రజా గళంతో లోకేశ్ బాబు నిరహిస్తున్న పాదయాత్రకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారన్నారు. జగన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని గంజాయి హబ్ గా మార్చారని, యువతకు జరిగిన అన్యాయాన్ని ఎండగడుతూ వస్తున్న లోకేశ్ బాబు పాదయాత్రలో యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు. యువగళం -ప్రజాగళంగా మారి యువతరానికి ఆదర్శంగా నిలుస్తూ, పాదయాత్రలో రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కనిపించే విధంగా జరుగుతుందన్నారు.
ప్రజల్లో నమ్మకం రేపుతున్న యువగళం.. ఆలపాటి రాజా మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను ప్రజలకు తెలియపరుస్తూ లోకేశ్ బాబు యువగళం పాదయాత్ర జరుగుతుందన్నారు. 13 జిల్లాల నుంచి 24 జిల్లాలుగా ఏర్పడ్డ రాష్ట్రానికి రాజధాని లేకుండా, మూలాలను నాశనం చేసిన జగన్ రెడ్డి పాలనను అంతముదించే శక్తిగా యువ గళం యాత్రను ప్రజలు హర్షిస్తున్నారన్నారు. 172 రోజులుగా జరుగుతున్న పాదయాత్రలో లోకేశ్ బాబు రైతులు, రైతు కూలీలు, కార్మికులు, పేదల సమస్యలను తెలుసుకుంటూ... టీడీపీ అధికారంలోకి వస్తే, ఏ విధంగా పరిష్కారం చేస్తామనే విషయాలను వివరిస్తూ, ప్రజలకు అర్థమయ్యే విధంగా హామీ ఇస్తూ, ప్రజల్లో నమ్మకాన్ని, ఉత్సాహాన్ని నింపుతూ పాదయాత్ర ముందుకు సాగుతుందన్నారు.
అక్రమాలు నిరూపిస్తే కేసులా..? జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. ప్రజలకు అమలు కాని హామీలను ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి ఎన్నో ఇచ్చి, రాష్ట్ర ప్రజల గొంతు నొక్కాడని అన్నారు. వైసీపీ గుర్తించిన 32 స్థానాల్లో రెండు స్థానాలు కూడా వైసీపీ గెలిచే పరిస్థితి లేదని ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికతో ఆ పార్టీ నేతల గుండెల్లో వణుకు పుడుతుందన్నారు. టీడీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు ప్రవేశపెట్టిన 83 పథకాలను వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కి, వారికి తీరని అన్యాయం చేసిందన్నారు. యువగళం పాదయాత్రలో ప్రజల నుంచి వస్తున్న సమస్యలకు, లోకేశ్ బాబు ఇస్తున్న హామీలను టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పారు. యువగళం ప్రజాగళంగా మారిందన్నారు. స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అక్రమ మైనింగ్ చేయడంపై ఇప్పటికే నియోజకవర్గ ప్రజల్లో చర్చ మొదలైందన్నారు. మీడియా సాక్షిగా అక్రమ మైనింగ్ పై ఎమ్మెల్యే బొల్లా ఆకృత్యాలను తాము నిరూపించిన నేపథ్యంలో, టీడీపీ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టించాడని మండిపడ్డారు. నియోజకవర్గంలో జరగనున్న లోకేశ్ యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకే ఇటువంటి కవ్వింపు చర్యలకు ఎమ్మెల్యే బొల్లా పాల్పడడం సిగ్గుచేటన్నారు. తప్పుడు కేసులు ఎన్ని బనాయించినా కార్యకర్తలకు, నాయకులకు పార్టీ అండగా నిలుస్తుందని జీవీ భరోసా కల్పించారు.