MINISTER AMBATI RAMABABU : ఇటీవల కురిసిన అధిక వర్షాలకు పంట నష్టపోయిన ప్రతీ రైతుని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పల్నాడు జిల్లా అమరావతి, పెదకూరపాడు మండలాల్లో పూర్తిగా దెబ్బతిన్న పత్తి, మిర్చి పంటలని స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకర రావు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో కలసి ఆయన పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేసి త్వరితగతిన రైతులకి సబ్సిడీ అందేలా చూస్తామన్నారు. రైతులు తప్పనిసరిగా ఈ క్రాప్‌లో పంటలని నమోదు చేసుకోవాలని సూచించారు.
MINISTER VIDADALA RAJINI : అధిక వర్షాలకు పంట నష్ట పోయిన ప్రాంతాలలో అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి విడదల రజని పేర్కొన్నారు. మంత్రి రజిని.. జిల్లా కలెక్టర్ శివ శంకర్‌తో కలిసి పల్నాడు జిల్లా యడ్లపాడు, నాదెండ్ల మండలాలలోని దింతెనపాడు, నాదెండ్ల ప్రాంతాలలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. కొన్ని ప్రాంతాలలో అధిక వర్షాలకు పంట నష్టం జరిగిందని.. గత ఏడాది అక్టోబర్ నెలలో 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ప్రస్తుతం 19.5 సెంటీమీటర్లు ఉందన్నారు. గత ఏడాది కన్నా ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం ఎక్కువగా ఉండటంతో కొన్ని ప్రాంతాలలో పంటలకు నష్టం వాటిల్లిందన్నారు.
నష్టపోయిన పొలం, రైతుల వివరాలు నమోదు చేసి వెంటనే నివేదికను ప్రభుత్వానికి పంపించి పరిహారం అందించేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత వర్షాలు సుభిక్షంగా పడి రైతులు సంతోషంగా ఉన్నారని.. రాష్ట్రంలో రైతును రాజును చేసేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అందుకోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు.
ఇవీ చదవండి: