Argument Between Police And TDP Workers In Rayavaram : పల్నాడు జిల్లా మాచర్ల టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా.. ఆ పార్టీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రెంటచింతల నుంచి రాయవరం వరకు ఊరేగింపుగా బయలుదేరారు. కంభంపాడు వద్ద ర్యాలీగా వెళ్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. మాచర్ల మండలం రాయవరంలో జరిగిన జూలకంటి బ్రహ్మారెడ్డి పుట్టినరోజు వేడుకలకు మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగాయరపతినేని మాట్లాడుతూ.. తమ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపైన ఆయన ప్రస్తావించారు. జూలకంటి పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
20వేల మెజార్టీతో గెలవడం ఖాయం : పల్నాడులో టీడీపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని.. తాము అధికారంలోకి వస్తే వీళ్ల లెక్కలు అప్పజెబుతామని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. మాచర్లలో పిన్నెల్లి సోదరుల అరాచకాలకు అంతులేకుండా పోయిందని.. వీరిని ఎదుర్కొవడానికి టీడీపీ కార్యకర్తలు కొదమ సింహాల్లా దూకాలని పిలుపునిచ్చారు. తాను, బ్రహ్మారెడ్డి సొంత అన్నదమ్ముల వలే కలిసి పని చేస్తున్నామని, వచ్చే ఎన్నికల్లో మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి 20వేల మెజార్టీతో గెలవడం ఖాయమని యరపతినేని అన్నారు.
పోలీసులు మూల్యం చెల్లించుకోవాల్సిందే : మాచర్ల టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ.. ఒక వ్యక్తి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలంటే ఇన్ని అడ్డంకులా అంటూ ప్రశ్నించారు. పోలీసుల ఆంక్షలు దాటుకుని వేలాది మంది కార్యకర్తలు తన పుట్టిన రోజు వేడుకులకు హాజరయ్యారని అన్నారు. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలను వేధించిన వారందరూ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జూలకంటి హెచ్చరించారు.
స్వీట్ తయారీ కేంద్రం కూల్చివేత: పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్సీపీ నాయకులు అరాచకానికి తెగబడ్డారు. వివాదాస్పద స్థలంలో ఉన్న స్వీట్ తయారీ కేంద్రాన్ని, ఇంటిని వైఎస్సార్సీపీ నాయకులు దౌర్జన్యంగా కూల్చి వేశారు. వినుకొండ పట్టణంలోని తిమ్మాయపాలెం రోడ్డులోని ఓ షెడ్డులో శశిధరణి స్వీట్స్ తయారీ కేంద్రం ఉంది. పక్కనే ఇళ్లు కూడా నిర్మించుకుని ఉన్నారు. ఈ రెండింటినీ మంగళవారం ఉదయం వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు ఖాన్ తన అనుచరులతో కలిసి కూల్చివేశాడు. అడ్డుకున్న యజమానులపై దాడికి పాల్పడ్డారు.
వాస్తవంగా ఈ స్థలం వక్ఫ్ బోర్డుకు చెందినది. అయితే ముస్లిం మత పెద్దల నుంచి 10సెంట్ల స్థలాన్ని కొన్నారు. అక్కడ స్వీట్ తయారీ షెడ్‌తో పాటు ఇళ్లు కట్టుకున్నారు. ఇటీవలే వక్ఫ్ బోర్డు స్థలాల్ని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇద్దరు యజమానులకు వినుకొండ మున్సిపాలిటి టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులిచ్చారు. స్థలం యజమానులు కూడా ఈ విషయంపై కోర్టుకు వెళ్లారు.
కోర్టులో విచారణలో ఉండగానే దౌర్జన్యంగా కూల్చి వేశారు. ఇళ్లు కూల్చి వేసే అధికారం మున్సిపాలిటికి మాత్రమే ఉంటుంది. కానీ అధికార పార్టీ నాయకులు దౌర్జన్యంగా ఆ పని చేయటంపై విమర్శలు వస్తున్నాయి. కనీస సమయం ఇవ్వకుండానే ఇళ్లు, షెడ్డు కూల్చి వేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం వెనుక స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు ఉన్నారని ఆరోపిస్తున్నారు. స్వీట్ల తయారీ కోసం ఇటీవలే రాజస్థాన్ నుంచి యంత్రాన్ని కూడా అప్పు చేసి కొనుగోలు చేసి తెచ్చామని, ఇప్పుడు కూల్చి వేయడంతో తమకు ఉపాధి లేకుండా చేశారని ఆవేదన వెలిబుచ్చారు. తమకు రక్షణ కల్పించాలని, జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించాలని కోరుతూ పట్టణ సీఐ అశోక్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి