Macharla Incident: మాచర్లలో టీడీపీ నాయకులు ప్రశాంతంగా వారి కార్యక్రమం వారు చేసుకుంటుంటే వైసీపీ నాయకులే పథకం ప్రకారం దాడి చేశారని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. పల్నాడు జిల్లా మాచర్ల లో ఇటీవల జరిగిన ఇరువర్గాల ఘర్షణలో గాయపడి నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తలను పరామర్శించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సీఐతో సెలవు పెట్టించి మరీ వైసీపీ నాయకులు రెచ్చిపోయారని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు అన్నారు. మాచర్లలో టీడీపీ నేతలు కార్యక్రమాలు చేయకూడదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రోద్బలంతోనే పిన్నెల్లి సోదరులు దాడులకు తెగబడ్డారని దుయ్యబట్టారు. ముందస్తు పథకం ప్రకారమే పోలీసులు మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి బ్రహ్మారెడ్డిని పంపించి వైసీపీ నేతల చేత దగ్గరుండి విధ్వంసం చేసుకోమన్నారన్నారు. వైసీపీ మూక దాడుల్లో గాయపడ్డ మహిళలను అక్కడే ఉండి కూడా పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి కనీసం పరామర్శించలేదు. వైసీపీ నేతలు దాడులు చేసి బంగారం, డబ్బు, ల్యాప్ టాప్ లు దోచుకెళ్లారన్నారు.
అనంతరం గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ మాచర్ల లో పిన్నెల్లి సోదరులు మారణ హోమం సృష్టించారన్నారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అన్నదమ్ముల అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి బ్రహ్మారెడ్డిని అంతం చేయాలనే పిన్నెల్లి సోదరులు కుట్రచేశారని ఆరోపించారు. పల్నాడుజిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకుని పనిచేస్తే బాగుంటుందని హితువు పలికారు. గతంలో ఉన్న ఎస్పీలు చాలా హుందాతనంగా వ్యవహరించారన్నారు. టీడీపీ నేతలపై దారుణంగా దాడి చేసి తిరిగి వారిపైనే హత్యాయత్నం కేసులు పెట్టారన్నారు. వైసీపీ నేతలపై మాత్రం చిన్న కేసు కూడా నమోదు చేయలేదన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా అంబేడ్కర్ రాజ్యాంగంలోనే నడవాలన్నారు. కానీ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందన్నారు. వైసీపీ నేతలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అని ప్రశ్నించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే మాత్రం ఎస్పీ, డీజీపీ లను కూడా లెక్కచేయమన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి వంద సీట్లు దాటితే వైసీపీ నేతలు ఈ రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రాలకు పారిపోతారన్నారు.
ఇప్పుడు బాధ్యతగా పనిచేస్తున్న పోలీసులకు నమస్కారం పెడతామన్నారు. బాధితులకు టీడీపీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎక్కడైతే టీడీపీ కార్యాలయం, ఇల్లు తగలబెట్టారో అక్కడే మళ్లీ కొత్తవి కడతామన్నారు. మాచర్లలో మరింత ఉత్సాహంతో పనిచేస్తామని టీడీపీ నాయకులు వెల్లడించారు.
ఇవీ చదవండి